e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home హైదరాబాద్‌ ఫోన్‌కే బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లింపులు

ఫోన్‌కే బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లింపులు

జీడిమెట్ల, అక్టోబర్‌ 26: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మూడు సంవత్సరాల క్రితం రూ.33 కోట్లతో ప్రయోగాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ గ్రిడ్‌ పనులు పూర్తయ్యాయి. షాపూర్‌నగర్‌, జీడిమెట్ల విద్యుత్‌ సబ్‌ డివిజన్ల పరిధిలోని పలు బస్తీల్లోని 16 వేల స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. గతంలో ఉన్న మీటర్లకు ప్రస్తుతం ఉన్న మీటర్లకు తేడాను పరిశీలిస్తున్నది. స్మార్ట్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు ఎన్‌ఎస్‌జీఎం సంస్థ దేశవ్యాప్తంగా 14 ప్రాంతాలకు ఎంపిక చేయగా తెలంగాణ నుంచి మేడ్చల్‌ జిల్లాలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ వస్తున్న ఫలితాల ఆధారంగా గ్రేటర్‌ వ్యాప్తంగా స్మార్ట్‌ మీటర్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన విద్యుత్‌ శాఖ ఆ దిశగా అడుగులు వేస్తున్నది. 2025 నాటికి పూర్తిస్థాయిలో స్మార్ట్‌ మీటర్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న అధికారులు ఈ మేరకు వినియోగదారులపై భారం పడకుండా మీటర్ల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించాలని యోచిస్తున్నారు.

ఎస్‌ఎంఎస్‌ రూపంలో బిల్లులు..

గ్రేటర్‌లో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, దవాఖానలు, పార్కుల్లో స్మార్ట్‌ మీటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఏడాదిన్నర కిందటే జీడిమెట్ల పారిశ్రామిక వాడలో స్మార్ట్‌గ్రిడ్‌ ప్రాజెక్టు పేరుతో ఎనిమిది వేలకు పైగా గృహ వినియోగదారులకు సింగిల్‌ ఫేస్‌ మీటర్లను అమర్చగా ప్రస్తుతం ఆ సంఖ్య 16 వేలకు చేరింది. వీటితో పాటు 11 కేవీ ఫీడర్ల ఆటోమేషన్‌ కోసం ఆటో-రేక్లోజర్స్‌, ఫాల్డ్‌ పాసేజ్‌ ఇండికేటర్స్‌ వంటి పరికరాలు అమర్చారు. ప్రతీ యూనిట్‌ను పక్కాగా లెక్కించే అవకాశం ఉండటం.. స్లాబుల్లో మార్పులు లేకపోవడంతో బిల్లులు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వినియోగదారులకు చేరుతాయి. అంతేకాక ఏ సమయంలో ఎక్కువ విద్యుత్‌ వినియోగించారో తెలుసుకునే అవకాశం ఈ విధానం ద్వారా ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారానే అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకునే అవకాశాలు వినియోగదారులకు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.

కల్యాణ్‌నగర్‌లో కంట్రోల్‌ రూం..

- Advertisement -

స్మార్ట్‌గ్రిడ్‌ నెట్‌వర్క్‌ పర్యవేక్షణ, నియంత్రణ కోసం అమీర్‌పేట కల్యాణ్‌నగర్‌లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం(స్కాడా)ను ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్‌గ్రిడ్‌ ప్రాజెక్టుతో నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో పాటు వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించడం సులభతరం అవుతుందని విద్యుత్‌ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. విద్యుత్‌ అంతరాయాలు, హెచ్చుతగ్గులను ఆన్‌లైన్‌లోనే గమనించి తక్షణమే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

తగ్గనున్న పనిభారం..

స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో ఉద్యోగుల పనిభారం తగ్గనున్నది. బిల్లులు వసూలు చేసే వారి అవసరం ఉండదు. వినియోగదారులు కూడా ఆన్‌లైన్‌లోనే బిల్లులు చెల్లించవచ్చు. దీంతో ఉద్యోగులపై పర్యవేక్షణ సైతం తగ్గుతున్నదని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆ శాఖలో పని చేస్తున్న అధికారులు, సిబ్బందిని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు వినియోగిస్తున్నామని అన్నారు.

మూడు నెలల్లో ‘స్మార్ట్‌’ సేవలు..

జీడిమెట్ల పారిశ్రామికవాడలో స్మార్ట్‌గ్రిడ్‌ పనులు పూర్తయ్యాయి. స్మార్ట్‌ మీటర్ల కమ్యూనికేషన్‌ పనులను రెండు, మూడు నెలల్లో పూర్తి చేస్తాం. పాత మీటర్లు తొలగించి స్మార్ట్‌ మీటర్లను ఉపయోగంలోకి తేగానే వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో బిల్లులు వస్తాయి. స్మార్ట్‌గ్రిడ్‌ ప్రాజెక్టు కింద జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం ఎంపిక కావడం వరంగా భావించవచ్చు. స్మార్ట్‌గ్రిడ్‌తో నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో పాటు సత్వర సేవలు అందడం ఖాయం.- వై.నర్సింహారెడ్డి, జీడిమెట్ల విద్యుత్‌ డివిజన్‌ డీఈ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement