కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 24 : కూకట్పల్లి నియోజకవర్గంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరిస్తూ.. నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పోలీస్, పలు విభాగాల అధికారులతో కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించి ఆయా విభాగాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై దృష్టిసారించారు. తుది ఓటరు జాబితాతో పాటు కొత్తగా ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం, పోలింగ్ కేంద్రాలలో వసతులు, కొత్త పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు అంశాలను పరిశీలిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా నిబంధనలకు విఘాతం కలుగకుండా ప్రత్యేక బృందాలతో నిఘాను ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన..
ఇప్పటికే తుది ఓటరు జాబితాను ప్రకటించగా ఈనెల 31 వరకు కొత్త ఓటరు నమోదుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. కాగా.. కొత్తగా ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులలో అర్హులను గుర్తించి అనుబంధ జాబితాలో పేరు చేర్చనున్నారు. కొత్తగా ఓటర్లు జాబితాలో చేరుతుండడంతో పెరిగిన ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే అంశాలను పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కును వినియోగంచుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దివ్యాంగులు, వృద్దులు ఓటేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈవీఎంల పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఓటింగ్ శాతాన్ని పెంచడంపై దృష్టిసారించారు.
సీ విజిల్లో ఫిర్యాదులు..
ఎన్నికల అవినీతికి చెక్ పెట్టేందుకు సీ విజిల్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఓటర్లకు ఈ యాప్ బ్రహ్మస్త్రంగా మారనుంది. సీ విజిల్ యాప్లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిశీలించిన నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. అభ్యర్థులు డబ్బు, మద్యం, ఇతర వస్తువులను ఎరగా చూపితే ఈ యాప్ ద్వారా వీడియోలు, ఫొటోల రూపంలో అప్ లోడ్ చేస్తే ఈ ఫిర్యాదులను సబంధిత ఎన్నికల విభాగం అధికారులు వెంటనే స్పందించనున్నారు. రూ.50వేలకు మించి నగదును వెంట తీసుకెళ్తే.. ఆ డబ్బులకు సంబంధించిన రుజువులు చూపాల్సి ఉంటుందని లేనిపక్షంలో ఆ డబ్బులను స్వాధీనం చేసుకుంటారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా అపశృతులు తొర్లకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రత్యేక బృందాలతో నిఘా..
ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో చేస్తున్న పనులపై ప్రత్యేక దృష్టినిసారించారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులు, ప్రచారతీరు, ప్రలోభాల నియంత్రణకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. స్టాటిక్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, సర్వోలెన్స్ బృందాలు, వీడియో వ్యూయింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. నామినేషన్ ప్రక్రియపై రాజకీయ పార్టీల నేతలకు అవగాహన కల్పిస్తున్నారు. నామినేషన్ వేసినప్పటినుంచి ఎన్నికలు ముగిసేవరకు నాయకుల కదలికలు పరిశీలించడంతో పాటు అభ్యర్థుల ప్రచార వ్యయం, ప్రచార సరళి, ప్రలోభాలకు పాల్పడే అంశాలపై దృష్టిసారించారు. నగదు, ఇతర బహుమతులు పంపిణీలపై ప్రత్యేక నిఘాను పెట్టారు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే నాన్బెలేబుల్ వారంటీలు, బైండోవర్, పీడీ చట్టాన్ని ప్రయోగించనున్నట్లు హెచ్చరికలు చేస్తున్నారు.
అందరూ సహకరించాలి
కూకట్పల్లి నియోజకవర్గంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తుది ఓటరు జాబితాను ప్రకటించగా కొత్తగా వచ్చిన ఓటర్లతో అదనపు జాబితాను ప్రచురించడం జరుగుతుంది. పోలింగ్ కేంద్రాలలో సకల వసతులు ఉండేలా ఏర్పాట్లు చేయడంతో పాటు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీల నేతల ప్రచారంపై ప్రత్యేక నిఘా బృందాలతో దృష్టిపెట్టారు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిస్తే సీ విజిల్ యాప్లో ఫిర్యాదు చేయాలని కోరుతున్నాం. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఓటర్లు, రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని విజ్ఞప్తి.
– టి.శ్యాంప్రకాశ్, ఆర్వో, కూకట్పల్లి నియోజకవర్గం