జూబ్లీహిల్స్, జూన్ 25: భారత్- ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య ఫార్మా రంగంలో ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు భారత ప్రతినిధి, నియో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఎండీ డాక్టర్ బుర్రా దివ్య సునీత రాజ్ పేర్కొన్నారు. మంగళవారం హోటల్ తాజ్‌కృష్ణలో ఉజ్బెకిస్తాన్- ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ అబ్దుల్లా అజిజోవ్, భారత్‌లో రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ రాయబారి హెచ్ఈ సర్డొర్ రుస్తుంబేవ్తో కలిసి ‘ఇండో- ఉజ్బెకిస్తాన్ ఫార్మా బిజినెస్ ఫోరం’ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ సదస్సు ఇరు దేశాల మధ్య ఫార్మా రంగంలో వాణిజ్యం, పెట్టుబడుల అవకాశాలు మరింత పెంపొందించేందుకు దోహదం చేస్తుందన్నారు.
ఇరు దేశాల మధ్య ఫార్మాస్యూటికల్ పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చే జాయింట్ వెంచర్లు, పరిశోధన సహకారం, సాంకేతికత బదిలీలకు మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వైద్య పరిశ్రమ, వైద్య విద్యా రంగాల్లో పలు ఎంఓయూలు కుదుర్చుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉజ్బెకిస్తాన్ ఎంబసీ నుంచి రాయబారులు ఎస్.సుయరోవ్, కె.సమియెవ్, ఎస్.ఒబ్లొయొరొవ్, ఎస్.ఇషంఖనొవ్, బీవీకే రాజ్, వెలుగుబంట్ల శ్రీరోహిత్, బుఖారా ప్రాంతీయ ప్రభుత్వాధినేత మహమ్మద్జన్ రేఖనోవ్, జె.యుల్దెషెవ్, భారతీయ ఫార్మా కంపెనీలైన హెటెరో ల్యాబ్స్, భారత్ బయోటెక్, ఇతర ప్రధాన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.