అంబర్‌పేట : రాష్ట్రంలో ఫార్మాసిస్టుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ హామీ (Minister Damodara Rajanarasimha) ఇచ్చారు. తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం తెలంగాణ సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్‌గౌడ్, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ జె.అశోక్, స్టేట్ అడ్వయిజర్ ఎం.డి.ముతార్అహ్మద్ పూలబొకే ఇచ్చి శాలువాతో సన్మానించి ఫార్మసిస్టుల సమస్యలను మంత్రికి వివరించారు. ఫార్మసిస్టులను ఫార్మసీ ఆఫీసర్స్‌గా మార్చాలని, ప్రతి ఫార్మసిస్టు కు అతని సర్వీసులో కనీసం నాలుగు రకాల ప్రమోషన్స్ ఇవ్వాలని కోరారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు ఫార్మసిస్టులను నియమించాలని, ఫార్మసిస్టులకు పనిభారం తగ్గించాలని, ఫార్మసిస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
దీనికి స్పందించిన మంత్రి త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఫార్మసిస్టుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్.చోంగ్తును కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాబర్ట్ బ్రూస్, ఎం.అవినాష్, రాఘవేందర్రావు పాల్గొన్నారు.