IAS Devasena | సిటీబ్యూరో, మార్చి 1 ( నమస్తే తెలంగాణ ) : మహిళలు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన అన్నారు. నెలసరి నొప్పి అనేది చాలా సున్నితమైన సమస్య అని చెప్పారు. నెలసరి నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఎండో మెట్రియోసిస్ సమస్యగా భావించి సరైన చికిత్స తీసుకోవాలన్నారు. బేగంపేట్లో శుక్రవారం హోటల్ మ్యారీగోల్డ్లో ఎండో మెట్రియోసిస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎండోమెట్రియోసిస్ వ్యాధిపై పబ్లిక్ అవేర్నెస్పై ప్యానల్ డిస్కషన్ జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఏఎస్ దేవసేన హాజరై మాట్లాడుతూ.. చాలా మంది మహిళలు ఎండోమెట్రియోసిస్పై అవగాహన లేక సాధారణ నెలసరి నొప్పులుగా భావించి తీవ్రంగా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్యపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతరం ఎండో మెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ విమి బింద్ర మాట్లాడుతూ.. ఎండోమెట్రియోసిస్ అనేది కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగానూ మహిళలను తీవ్ర క్షోభకు గురిచేస్తుందని చెప్పారు.
ఈ వ్యాధిపై అవగాహన ఉంటేనే ఆ బాధ నుంచి విముక్తి పొందగలుగుతారని సూచించారు. ఈ వ్యాధి తీవ్రతపై ఆరోగ్యశాఖ అధికారులకు కూడా తమ ఫౌండేషన్ తెలియజేసిందని చెప్పారు. ప్రపంచంలో 200 మిలియన్ల మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నారని , ప్రపంచంలో 8వ దేశంగా భారత్ ఉందని వెల్లడించారు. అనంతరం డాక్టర్ మాలతీ మాట్లాడుతూ.. పీరియడ్స్ గురించి మాట్లాడటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్ మాట్లాడుతూ.. నెలసరి రోజు సెలవు తీసుకొనేలా పరిస్థితులు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గాయత్రి కో ఫౌండర్ స్వర్ణిమ పాల్గొన్నారు.