హైదరాబాద్: తమ కంపెనీలో డిపాజిట్లు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు ఇస్తామంటూ నమ్మించి 6979 మందికి కుచ్చుటోపీ పెట్టిన ఫాల్కన్ స్కామ్‌పై (Falcon Scam) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదుచేసింది. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించింది. హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ స్కాంలో దేశవ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. 22 షెల్ కంపెనీల ద్వారా ఆ డబ్బును విదేశాలకు మళ్లించినట్లు తేలింది. దుబాయ్, మలేషియా, సింగపూర్‌కు డబ్బు పంపినట్లు ఈడీ గుర్తించింది.
కాగా, ఒక్క హైదరాబాద్‌లోనే రూ.850 కోట్లు కుచ్చుటోపీ పెట్టినట్లు సైబరాబాద్ ఆర్థికనేరాల విభాగం గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయగా, పవన్ కుమార్ ఓదెల, కావ్య నల్లూరి, అనంతను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితులైన ఫాల్క్ క్యాపిటల్ వెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అమర్దీప్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సీఈవో యోగేందర్ సింగ్ దుబాయ్ పారిపోయారు. ఈ నేపథ్యంలో అమర్దీప్ కుమార్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
కాగా, అమర్దీప్ కుమార్ 2021లో ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ప్రజలను నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. డిపాజిటర్లను ఆకర్షించేందుకు మొబైల్ అప్లికేషన్, వెబ్‌సైట్‌ను రూపొందించాడు. తాము అమెజాన్, బ్రిటానియా, గోద్రేజ్ వంటి పేరొందిన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని నమ్మబలికారు. ఎవరైనా రూ.25వేల నుంచి రూ.9లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చని, ఏడాదికి 11 నుంచి 22 శాతం లాభం ఇస్తామని ప్రచారం చేశాడు. మొత్తం 6979 మంది డిపాజిటర్ల నుంచి రూ.1700 కోట్లు పెట్టుబడి రూపంలో వసూలు చేశాడు. వీటిని వివిధ రూపాల్లో 14 కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్టు తెలిపాడు. కానీ ఇందులో కొన్ని నకిలీ ఒప్పందాలుగా పోలీసులు తేల్చారు.
కంపెనీ యజమానులు కొందరు డిపాజిటర్లకు రూ.850 కోట్లు తిరిగి చెల్లించగా ఇంకా రూ.850కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. నిందితులపై గతంలోనూ మల్టీలెవల్ మార్కెటింగ్ కింద కేసులు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఓదెల పవన్‌కుమార్, డైరెక్టర్‌గా పనిచేస్తున్న నెల్లూరి కావ్యను అరెస్టు చేశారు.