సిటీబ్యూరో, నవంబర్ 8(నమస్తే తెలంగాణ) : ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. మీరెవరికీ ఓటేస్తారు. తెలంగాణలో గెలిచే పార్టీ ఏంటీ? కింద పేర్కొన్నవారిలో ఏ అభ్యర్థి గెలుస్తారు? అంటూ ఒకప్పుడు పొలిటికల్ ఏజెన్సీల స్థానికంగా తిరుగుతూ సర్వే చేసేవారు. కానీ అందుబాటులోకి వచ్చిన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంలపై ప్రతి ఒక నెటిజన్ సర్వే నిపుణుడి అవతారం ఎత్తుతున్నాడు. అలా సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుత అసెంబ్లీ తీరుతెన్నులు, పార్టీల స్థితిగతులు, రాజకీయ నాయకుల భవితవ్యాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు. ఒకప్పుడు సంప్రదాయ సర్వే విధానాల కంటే కంటే వేగంగా, ఎక్కువ మంది డిజిటల్ సర్వేలలో పాల్గొంటుండగా, జనాల నుంచి వచ్చే స్పందన కచ్చితత్వంతోనే ఉంటుంది. అయితే కొంత మంది నెటిజన్లు పార్టీలను అభిమానిస్తూనే పర్సనల్ వేదిక ద్వారా ఈ తరహా సర్వేలు నిర్వహిస్తూ ప్రజా నాడీ తెలుసుకునే వారు కూడా ఉన్నారు.
విస్తృతంగా వ్యాప్తి చెందిన సోషల్ మీడియా అసెంబ్లీ ఎన్నికల్లోనూ వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అభ్యర్థుల ప్రచారం, రాజకీయ అంశాలను మాత్రమే పంచుకునే స్థాయిలో నుంచి… యూజర్ల అభిప్రాయాలు, మనోగతాన్ని తెలుసుకునే సర్వే వేదికలు నిలుస్తున్నాయి. సాధారణ పొలిటికల్ సంబంధిత విషయాల కంటే రాజకీయ పరమైన అంశాలపై జనాల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా యూజర్లు గణనీయంగా పెరిగిన తరుణంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు, పార్టీలు చేసిన అభివృద్ధి, నాయకుల పనితీరును సోషల్ మీడియా వేదికనే ఆడిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ మీడియా మాధ్యమాలను సర్వే చేసేందుకు వేదికలుగా చేసుకుని నిర్వహిస్తున్నారు.
ఎక్కువ మంది యూజర్లు ఉండే ఇన్‌స్టా, యూట్యూబ్, ఎక్స్(ట్విట్టర్) వంటి మాధ్యమాలను ఇప్పుడు సర్వే వేదికలుగా మారిపోతున్నాయి. ఫాలోవర్స్ లెక్కన పొలిటికల్ స్టేటస్ తెలుసుకునేందుకు నెటిజన్లు వినియోగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఫలానా పార్టీ గెలుస్తుందా? ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటు వేస్తారు? సీఎం అభ్యర్థిగా ఎవరూ ఉండాలి? ఇలా ప్రస్తుత రాజకీయాల చుట్టూనే తిరుగుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో వినియోగించే వారంతా సర్వేలో వ్యక్తిగత అభిప్రాయాలను తెలుపుతున్నారు.
నిజానికి ఎన్నికలు వచ్చాయంటే పొలిటికల్ ఏజెన్సీలు, సర్వే సంస్థలు పార్టీలను ఆశ్రయించి, ఇంటింటికి, గ్రామాలు, పట్టణాలు, సంబంధిత నియోజకవర్గంలో తిరుగుతూ స్థానికుల అభిప్రాయాలు సేకరించడం, వాటి ఫలితాలను ఆయా పార్టీలకు అందజేయడం షరా మామూలే. కానీ సోషల్ మీడియా అకౌంట్ ఉండి, ఫాలోవర్లు ఉన్న యూజర్ తప్పనిసరిగా పొలిటికల్ నేపథ్యం ఉండే విషయంపై నెటిజన్ల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. ఇలా సాధారణ, సంప్రదాయ సర్వేలకు ధీటుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో సర్వే ట్రెండ్ నడుస్తోంది. పొలిటికల్ అనలిస్టులు కూడా రాజకీయ నిపుణులు కూడా సోషల్ మీడియాను వినియోగించుకుని జనాల నాడీని తెలుసుకునేందుకు వాడుతున్నారు.