సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు నిఘా పెంచారు. ప్రతి సమాచారాన్ని సీరియస్‌గా తీసుకుంటున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడ డ్రగ్స్ దందా కొనసాగినా.. పసిగట్టి పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్ దందా చేస్తున్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒక వైద్యుడు కూడా ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతడు క్లినిక్ ముసుగులో డ్రగ్స్ దందా మొదలు పెట్టాడు. ఆయా కేసులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
డబ్బు కోసం వైద్యుడి డ్రగ్స్ దందా..
నగరంలో డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వైద్యుడిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. వెస్ట్‌బెంగాల్‌కు చెందిన మహ్మద్ షబ్బీర్ అలీ ఇంటర్ పూర్తి చేసి, 2007లో కోల్కత్త యూనివర్సిటీలో ఆయుర్వేద కోర్సులో చేరాడు. 2009లో హైదరాబాద్‌కు జీవనోపాధి కోసం వచ్చిన అతడు గౌలిగూడలో దిలీప్‌కుమార్ అనే వైద్యుడి వద్ద మూడు నెలల పాటు పని చేశాడు. ఆ తర్వాత సొంతంగా చాంద్రాయణగుట్టలో పర్ఫెక్ట్ డెంటల్ అండ్ పైల్స్ పేరుతో క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు. వచ్చిన సంపాదన సరిపోకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. ఇందుకు డ్రగ్స్ విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఇండియా మార్ట్ వెబ్సైట్ ద్వారా కెటామైన్, ఎండీఎంఏ డ్రగ్స్ కోసం వెతికాడు.
ఈ క్రమంలో చెన్నైకి చెందిన శివతో పరిచయం ఏర్పడింది. రూ.30వేలు అతడికి చెల్లించి, ఎండీఎంఏ డ్రగ్‌కు ఆర్డర్ చేశాడు. గత ఏడాది జూలై నెలలో 53 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ బ్లూ డాట్ కొరియర్ ద్వారా షబ్బీర్ అలీకి చేరింది. అప్పటి నుంచి ఆ డ్రగ్‌ను విక్రయించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ, కస్టమర్లు దొరకడం లేదు. ఈ క్రమంలోనే ఇటీవల ఒడిశాలోని మల్కాన్గిరికి వెళ్లాడు. అక్కడ 850 గ్రాముల కెటామైన్ డ్రగ్‌ను రూ.12 లక్షలకు కకు అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి, హైదరాబాద్‌కు వచ్చాడు. గురువారం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చాంద్రాయణగుట్టలోని డెంటల్ క్లినిక్‌లో సోదాలు చేశారు. 53 గ్రాముల ఎండీఎంఏ, 850 గ్రాముల కెటామైన్ డ్రగ్ లభించింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి రూ. 12.32 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించినట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.