ఖైరతాబాద్, డిసెంబర్ 25 : నిమ్స్‌లో పొరపాటున ఆ నీరు తాగితే తిరిగి అదే ఆస్పత్రిలో చేరాల్సి వస్తోందని రోగులు, వారి సహాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిమ్స్ డైరెక్టర్ నిర్లక్ష్యం.. సిబ్బంది అలసత్వంతో తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిమ్స్ దవాఖానలో రక్షిత మంచినీటి కోసం క్లీన్ వాటర్ అండ్ ఎనర్జీ ట్రస్ట్, ‘సేఫ్’ వాటర్ నెట్వర్క్, ‘సేవా’ స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఆరు స్టేజీల ప్రక్రియ నీటి శుద్ధి జరిగి ఆ యంత్రం స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తుంది. స్విచ్ నొక్కితే లీటరు చొప్పున మంచినీరు వస్తుంది. గత కొంత కాలంగా నిమ్స్‌లో తాగునీటి వ్యవస్థ నిర్వహణ బాధ్యతను యాజమాన్యం గాలికి వదిలేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా అపరిశుభ్రమైన తాగునీటితో పాటు ఆ నీటిని పట్టుకునే చోట అపరిశుభ్రత, దుర్గంధం నెలకొంది.
ఒక వైపు నిమ్స్ దవాఖానకు వివిధ రూపాల్లో దాతల నుంచి కోట్లాది రూపాయల విరాళాలు వస్తుండగా, కనీస అవసరమైన స్వచ్ఛమైన తాగునీటిని అందించే చిత్తశుద్ధి యాజమాన్యానికి లేదంటూ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా నిమ్స్ దవాఖానలో పీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిరూపయోగంగా మారిందంటున్నారు. ఓ స్వచ్ఛంద ఆధ్వర్యంలో పలు వార్డుల వద్ద ఏర్పాటు చేసిన తాగునీటి వ్యవస్థ నిర్వహణను సైతం మరిచిపోవడంతో రోగుల సహాయకులు ఆ నీటిని తాగేందుకు ముందుకు రావడం లేదు. కొందరు మాత్రం విధి లేక ఆ నీటినే పట్టుకొని సేవిస్తూ రోగాలబారిన పడుతున్నట్లు తెలిసింది. ఈ అపరిశుభ్ర నీటిని సేవిస్తే టైఫాయిడ్, అతిసారం, ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయంటున్నారు. వచ్చే ఎండాకాలంలో ఇదే పరిస్థితి కొనసాగితే రోగులకు ఇబ్బందులు తప్పవంటున్నారు. తక్షణమే ఈ నీటి వ్యవస్థను సరిచేయాలని, నిమ్స్‌కు వచ్చే విరాళాలను సక్రమంగా వినియోగించి ఇలాంటి సమస్యలను తీర్చాలని రోగుల సహాయకులు కోరుతున్నారు.