బండ్లగూడ, మే 25 : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు వరదలై పారుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ప్రజలకు అనేకసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒయాసిస్ అపార్ట్మెంటు నుంచి శ్రీ ఎన్క్లేవ్, లోనేట విల్లాస్, కావురి హిల్స్ తదితర కాలనీలకు వెళ్లే దారిలో డ్రైనేజీలు పొంగడం నిత్యకృతంగా మారింది. దీంతో ఆ డ్రైనేజీ నీటిలో ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రైనేజీ సమస్యల కారణంగా అంటువ్యాధులు కూడా ప్రబలుతున్నాయని చెబుతున్నారు. ఆస్తి పన్నుల వసూలులో ఉన్న శ్రద్ధ, సమస్యలు పరిష్కరించడంలో చూపడం లేదని అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీల సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.