సిటీబ్యూరో, జూలై 13,(నమస్తే తెలంగాణ): నిరుపేదలు , బస్తీవాసులకు చేరువలో ఉండే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీహెచ్‌సీలు) రక్త పరీక్షలతో పాటు, ఇతర డయాగ్నోస్టిక్స్ సేవలు నిలిచిపోయాయి. తీవ్రమైన కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడే రోగులకు డీ3 పరీక్షలు నిర్వహించకుండానే గోలీలు ఇచ్చి సరిపెడుతున్నారు. పాపం పేద ప్రజలు పరీక్షలు ఎందుకు చేయడం లేదని అడిగే ధైర్యం లేక ఇచ్చిన మందులతోనే సరిపెట్టుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో యూపీహెచ్సీల్లోనే ఉచితంగా డయాగ్నోస్టిక్స్ సేవలందించగా, ఈ ప్రభుత్వంలో మాత్రం గాంధీ, ఉస్మానియాకు వెళ్లండని వైద్యులు రిఫర్లు చేస్తున్నారు.
హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి పరిధిలో ఉన్న 93 యూపీహెచ్‌సీల్లో పేద ప్రజలకు నిర్వహించే 134 ఉచిత డయాగ్నోస్టిక్స్ సేవలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. మొన్నటివరకు థైరాయిడ్ పరీక్షలు నిర్వహించడం లేదని బాధితులు అధికారులను వేడుకున్నారు. దయ తలచిన అధికారులు.. థైరాయిడ్ పరీక్షలు ఇక నుంచి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ మరో కీలకమైన డీ3 పరీక్షకు బ్రేక్ వేశారు.
ఒకప్పుడు పెద్దలు, వృద్ధులు మాత్రమే కీళ్లనొప్పులు, కాళ్ల నొప్పులతో బాధపడేవారు.. కానీ ప్రస్తుత రోజుల్లో చిన్నారులు మొదలుకొని వృద్ధుల వరకు వయస్సుతో సంబంధం లేకుండా కాల్షియం డెఫీషియన్సీతో బాధపడుతున్నారు. డీ3 పరీక్షల కోసమని యూపీహెచ్‌సీలకు వెళితే పరీక్షలు చేయకుండా సమస్య తీవ్రమైనా కూడా గోలీలు ఇచ్చి పంపిస్తున్నారు. డీ3 పరీక్షలు నిలిపేసిన విషయం రోగులకు తెలపకుండా రేపు, మాపు అంటూ చెబుతున్నారు. తీవ్రమైతే పెద్దాసుపత్రులకు రిఫర్ చేస్తూ చేతులు దులుపుకొంటున్నారు. ఇది మాత్రమే కాకుండా 134 రకాల ఉచిత పరీక్షల్లో కేవలం కొన్ని మాత్రమే చేస్తూ, ముఖ్యమైనవి దగ్గరలోని ప్రైవేట్ డయోగ్నోస్టిక్స్ లకు పంపిస్తుండటం గమనార్హం.
కేసీఆర్ హయాంలోనే శ్రీకారం..
పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యంతో పాటు, ఉచిత పరీక్షలు కూడా అందించేందుకు 2018లోనే కేసీఆర్ సర్కారు ముందడుగు వేసింది. ఈ క్రమంలో పేద ప్రజలకు ఉచితంగా రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు, థైరాయిడ్, లివర్, కిడ్నీ, హార్మోన్, క్యాన్సర్ స్క్రీనింగ్, ఈసీజీ, అల్ట్రాసౌండ్, మామోగ్రామ్ వంటి 134 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో సామాన్యులు వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే జిల్లా ఆసుపత్రి లేదా అందుబాటులో ఉన్న ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్‌కు వెళ్లేవారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించేందుకు పరికరాల కొరత కారణంగా ప్రైవేట్‌లోనే చేయించుకునేవారు.
ఈ తరుణంలో కొందరు ప్రభుత్వ వైద్యులు సైతం కమీషన్ల కోసం తమకు తెలిసిన ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్ యజమానులతో చేతులు కలిపి అనేక టెస్టులు రాసి, వాటిని కూడా చేయించుకోవాలని సూచించేవారు. మరోవైపు డయాగ్నోస్టిక్స్లు టెస్టుల పేరుతో ఎక్కువ మొత్తంలో వసూలు చేసేవారు. వైద్యుడు, డయాగ్నోస్టిక్స్ దోపిడీకి రోగి బలయ్యేవాడు. పరీక్షల పేరుతో సామాన్యుడి నుంచి ప్రైవేట్ సెంటర్లు రూ. వేలల్లో దండుకున్నాయి. కేసీఆర్ సర్కారు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఏర్పాటు వల్ల అనేక మంది ప్రజలు ఉచితంగానే 134 పరీక్షలు పొందుతుండటం విశేషం. బీఆర్ఎస్ పాలనలోనే ఉచిత వైద్య పరీక్షలు సామాన్యుల చెంతకు చేరడం విశేషం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యరంగంపై దృష్టి సారించకుండా విస్మరించడంతో పేదవాడికి సర్కారు వైద్యం దూరమవుతున్నది.