conocarpus | ఖైరతాబాద్, ఏప్రిల్ 15 : కోనోకార్పస్ చెట్లపై వస్తున్న అపోహలను నమ్మొద్దని.. అవి బహుజన ప్రయోజనకారిగా నిలుస్తాయని వక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్‌రావు మాట్లాడుతూ.. ప్రకృతిలో ఉన్న ఏ వృక్షం, జీవజాలం చెడు చేయవని తెలిపారు. కోనోకార్పస్ వృక్షాల వేర్లు విస్తరించి పైపులైన్లు, గోడలను దెబ్బతీస్తాయని, విష వాయువులను విడుదల చేస్తాయని పలు అపోహలు ఉన్నాయని చెప్పారు. ఏ చెట్ల వేర్లయినా విస్తరిస్తే అలాంటి ఫలితాలే ఉంటాయని వివరించారు.
కోనోకార్పస్ వృక్షాల వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నట్లు పరిశోధన పత్రాలు పేర్కొన్నాయని సీహెచ్ మోహన్ రావు అన్నారు. ఈ చెట్లు జంతువులుకు మేలు చేస్తుందని, హైవేలపై విషపూరితమైన వాయుకాలుష్యాన్ని తగ్గిస్తాయని చెప్పారు. ఈ చెట్ల ద్వారా సమకూరే నూనె సైతం ఔషధపరంగా ఎంతో ప్రయోజనకారిగా ఉంటాయని అన్నారు. ఈ నూనె యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని, మధుమేహం, వివిధ రకాల ఇన్ఫెక్షను తగ్గిస్తుందని అన్నారు.
జన చైతన్య వేదిక అధ్యక్షులు ప్రొఫెసర్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ.. కోనోకార్పస్ చెట్లు ఆక్సిజన్‌ను పీల్చుకుని కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుందని గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉన్న గడ్డం ప్రసాద్ అశాస్త్రీయమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. కోనోకార్పస్ చెట్లు అత్యధికంగా కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్‌ను సైతం అధికంగా విడుదల చేస్తుందని పరిశోధనలో తేలిందని చెప్పారు. నీటి లభ్యత లేకున్నా ఈ చెట్లు పెరుగుతాయని, దుబాయి లాంటి దేశాల్లో వీటిని పెంచుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా ఆ చెట్లను నరకడం మానుకోవాలని లేనిపక్షంలో సుప్రీంకోర్టులో ప్రజావ్యాజ్యం వేస్తామని తెలిపారు. కోనోకార్పస్ చెట్లను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.
ప్రపంచంలో సగటున ఒక మనిషికి 421 మొక్కలు ఉండగా, బ్రెజిల్లో 500, అమెరికాలో 470 ఉన్నాయని, కానీ భారతదేశానికి కేవలం 28 మాత్రమే ఉన్నాయని వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి తెలిపారు. వాల్టా చట్టం ఉన్నా చెట్లు, మొక్కలను నరికిన వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు లేవని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మొక్కలను నరికే చర్యలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని తెలిపారు.
యోగి వేమన యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ఏ ఆర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్లో వాతావరణంలో మార్పులు, వృక్షాల వల్ల మానవాళికి ఉపయోగాలు తదితర అంశాలను వివరించారు. 50 సంవత్సరాల క్రితం 350పీపీఎం ఉన్న కార్పన్ డయాక్సైడ్ ప్రస్తుతం 410కి చేరుకుందని, 2100 నాటికి 700కు చేరుకుంటుందని తెలిపారు. ఇది మానవాళికి అత్యంత ప్రమాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో దీని ఫలితం విపరీతంగా ఉంటుందని తెలిపారు. 2050 నాటికి సాధారణ ఉష్ణోగ్రతలు 49కి చేరుకుంటాయని తెలిపారు. వృక్షాలు ఎంత పెంచితే కార్బన్ డయాక్సైడ్ను అంత తగ్గించవచ్చని, ఇందులో కోనోకార్పస్ చెట్టు ముఖ్యమైందని అన్నారు. ఈ సమావేశంలో ఈ సమావేశంలో ప్రొఫెసర్ బీఎన్ రెడ్డి, విశ్రాంత అధ్యాపకులు గోపాలకృష్ణ, వీఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.