దుండిగల్,ఆగష్టు28ః వినాయకచవితి రోజునే ఓ ఇంట్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దేవుడికి దీపంపెట్టి వేరోచోట జరిగే పూజకు హాజరై వచ్చేలోగా దీపం కిందపడి మంటలు అంటుకుని ఇంట్లోని విలువైన వస్తువులతో పాటు బంగారం, నగదు అగ్నికి ఆహూతయ్యాయి. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ రాజీవ్‌గృహకల్ప సముదాయంలో చోటుచేసుకుంది.
బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, రాజీవ్ గృహకల్ప సముదాయం, 60వ బ్లాక్‌లోని డోర్‌నెంబర్ 2లో సిరిగిరి జ్యోష్ణ అనే మహిళ.. భర్త, కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటుంది. బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తమ ఇంట్లో దేవుడికి పూజలు చేసి దీపం పెట్టింది. అనంతరం ఇంటికి తాళం వేసి వేరేచోట జరిగే పూజకు కుటుంబసభ్యులంతా వెళ్లారు.
కొద్దిసేపటికి ఇంటో ్లనుంచి దట్టమైన పొగలు రావడం గమనించిన ఇరుగు, పొరుగు వారు జ్యోష్ణకు సమాచారం అందించారు. మంటలు ఎక్కువవుతుండటంతో డోర్ పగుల గొట్టి మంటలను ఆర్పివేశారు. అప్పటికే విలువైన వస్తువులతోపాటు మంచం, పరుపు పాక్షికంగా కాలిపోయాయి. జ్యోష్ణ పీజీ సర్టిఫికెట్లు సైతం పాక్షికంగా కాలిపోయాయి. అదే విధంగా ఇంట్లో దాచిన రూ.లక్ష నగదు, 7తులాల బంగారం కనిపించడం లేదని జ్యోష్ణ కుటుంబసభ్యులు పేర్కొన్నారు.