సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రజల ప్రశంసలు అందుకుంటున్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరనుంది. విపత్తు సమయాల్లో ప్రజలకు సాయం అందించే ఉద్దేశంతో దేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ డీఆర్ఎఫ్ బృందాలు అగ్నిప్రమాదం, కుండపోత వర్షాల సమయంలో అద్భుత పనితీరు కనబరిచి..పౌరుల మన్ననలు అందుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే నగరంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయాల్లో ప్రజలకు మరింత మెరుగ్గా సాయం అందించడానికి మూడు ప్రత్యేక వాహనాలతో పాటు తొలిసారిగా మొబైల్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. భారీ వర్షాలు, అగ్ని ప్రమాదాలు, ఇతర అవాంఛనీయ ఘటనల సమయంలో విలువైన సహాయక చర్యలను అందించడంలో ఈ మొబైల్ కంట్రోల్ రూం దోహదపడనుంది. అగ్ని ప్రమాదాలు, వరదలు, భవనాలు కూలిన సమయంలో వినియోగించేందుకు ఈవీడీఎం విభాగం మరో మూడు ట్రక్ వాహనాలను సమకూర్చుకుంటున్నది. ఇప్పటికే 27 వాహనాలు ఉండగా, తాజాగా 30 సర్కిళ్లకు గానూ పెండింగ్‌లో ఉన్న మూడు సర్కిళ్లలో ఈ వాహనాలతో భర్తీ చేస్తున్నారు.
ఎక్కడ లేని విధంగా తొలిసారిగా జీహెచ్ఎంసీ పరిధిలో విపత్తు నివారణలో కీలకంగా అధునాతన మొబైల్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొబైల్ కంట్రోల్ రూమ్‌లు మౌంటెడ్ కెమెరాతో డీఆర్ఎఫ్ ట్రకు(వాహనాల)లలో ఏర్పాటు చేస్తారు. స్రీన్లు, వైఫై, ఇంటర్-డిపార్ట్ మెంటల్ కమ్యూనికేషన్ నెట్వర్, డ్రోన్లు, రెస్యూ ఆపరేషన్లలో ఉపయోగించే అడ్వాన్స్ మెషినరీలతో ఈ వాహనాల్లో అమర్చబడతాయి. విపత్తు సంభవించినప్పుడు, ఈ వాహనాన్ని హుటాహుటిన ఘటనా స్థలానికి తరలించి, డ్రోన్‌ని ఉపయోగించి, విజువల్స్ క్యాప్చర్ చేస్తారు. ఇదే మొబైల్ కంట్రోల్ రూమ్ స్రీన్లపై ప్రదర్శించబడతాయి. తద్వారా ఈవీడీఎం రెస్క్యూ కార్యకలాపాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా దోహదపడనుంది. ప్రధానంగా రెస్క్యూ ఆపరేషన్ సమయంలో అగ్నిమాపక, పోలీసు, డీఆర్ఎఫ్, ఇతర శాఖల మధ్య సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా ఇంటర్-డిపార్ట్మెంటల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను మొబైల్ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేశారు. ఈ సమన్వయం రెస్యూ ఆపరేషన్లలో విలువైన ప్రాణాలను రక్షించడంలో గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ఈవీడీఎం విభాగం అధికారులు తెలిపారు. రెస్క్యూ సమయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో పాటు అంబులెన్స్ కదలికలను ట్రాఫిక్ పోలీసులకు కంట్రోల్ రూం ద్వారా సమాచారం అందిస్తారు.