సిటీబ్యూరో, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ): భాగ్యనగరంలో గతంలో ఎన్నడూ లేనంతగా నిష్పలమవుతున్న డిజాస్టర్ మేనేజ్మెంట్.. ప్రకృతి ప్రకోపించినా డిజాస్టర్ మేనేజ్మెంట్తో నగరవాసులను పరిరక్షించాల్సిన ఆ విభాగం ప్రస్తుతం గాలింపు చర్యలకే పరిమితమవడం విమర్శలకు దారితీస్తోంది. నాలాలలో పడి కొట్టుకుపోయిన వారి కుటుంబాల రోదనలు విన్నప్పటికీ అధికారులు మాత్రం నాలాల ఆక్రమణలంటూ పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం తప్ప గల్లంతైన వారి ఆచూకీ విషయంలో చిత్తశుద్ధ్ది కనబర్చడం లేదన్న చర్చ జరుగుతోంది. మొన్న ఆదివారం వర్షం బీభత్సం సృష్టించింది. వరద ప్రవాహంతో నాలాలో పడి కొట్టుకుపోయిన వారి కుటుంబాల్లో తమవారు తిరిగివస్తారనే ఆశలు గల్లంతయ్యాయి.
ముందు గల్లంతు సమాచారం తెలియకుండా చూసినప్పటికీ అందరూ వచ్చిపోతుండడం, మీడియాలో వార్తలతో విషయం తెలుసుకున్న ఆ భార్యకు తన భర్త తిరిగివస్తాడేమోనన్న ఎదురుచూపు మిగిలింది.మంగార్‌బస్తీ, వినోభానగర్‌లోని నాలాల్లో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయి ఇప్పటికి మూడురోజులైనా వారి ఆచూకీ మాత్రం దొరకలేదు. ప్రతీగంటకు గల్లంతైన వారి సంబంధీకుల్లో మిణుకుమిణుకుమంటున్న ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయి. తమవారిని తలుచుకుని వారు కారుస్తున్న కన్నీళ్లు ఇంకిపోతున్నాయి తప్ప కడసారి చూపు దక్కే పరిస్థితి కనిపించడం లేదు.
ఆశలు గల్లంతేనా..
ఆసిఫ్‌నగర్ మంగర్బస్తీలోని అఫ్జల్ సాగర్ నాలాలో ఆదివారం రాత్రి మామా అల్లుళ్లు కొట్టుకుపోగా వారి ఆచూకీ ఇప్పటివరకు దొరకలేదు. ఘటన జరిగిన రోజు నుంచి జీహెచ్ఎంసీ, డిజాస్టర్మేనేజ్మెంట్, పోలీస్, రెవెన్యూ శాఖ సిబ్బంది, అధికారులు కలిసి మంగర్బస్తీ నుంచి గోషామహల్ వరకు గాలింపు చర్యలు చేపట్టినా వారి జాడ దొరకడం లేదు. గల్లంతైన అర్జున్, రామ ఇద్దరు మామ, అల్లుళ్లు అవుతారు.
అర్జున్‌కు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉండగా నెల క్రితమే కొడుకు పుట్టాడు. రామకు నలుగురు పిల్లలున్నారు. ముషీరాబాద్‌లోని వినోబానగర్నాలాలో కొట్టుకుపోయిన దినేశ్ అలియాస్ సన్నీ ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన చోటనే దినేశ్ భార్య, మూడేళ్ల కొడుకు ఎదురుచూస్తూనే ఉన్నారు. వినోబానగర్ నుంచి ప్రేయర్పవర్చర్చి, ఆశీర్వాద్ అపార్ట్మెంట్, అడిక్‌మెట్, నాగమయ్యకుంట, పద్మాకాలనీ, బాగ్‌లింగంపల్లి, కోరంటి మీదుగా మూసారాంబాగ్ వరకు ఎంత వెతికినా దినేశ్ ఆచూకీ లభించలేదు.
నాలాల్లో వెతికినా అటునుంచి మూసీ వరకు చూసినా ఎక్కడా ఈ ముగ్గురి ఆచూకీ లభించకపోవడంతో డిజాస్టర్మేనేజ్మెంట్ విభాగంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదని, డిజాస్టర్కే డిజాస్టర్ వచ్చిందంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గాలింపుచర్యలకు అంతరాయమేర్పడిందని అధికారులు ప్రకటించిన చాలా సమయం తర్వాత గల్లంతైన వారి ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టారు. కానీ అప్పటికే వారు ఆ ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోయారు.
అయితే ప్రవాహం ఎటువైపు ఉంటుందో అటు వైపుగా వెతకాల్సిన బృందాలు కేవలం సిటీవరకే పరిమితమవడంతో కొందరు కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం ప్రవాహం ఉన్న వైపు బృందాలుగా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇలా చేసుకుంటూ పోతే తమ వారిని తామే దొరకబట్టాలని తిరుగుతున్నట్లు బంధువులు చెప్పారు.