ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 18 : ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆధునిక విద్యావిధానాలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం అన్నారు. భవిష్యత్తులో డిజిటల్ విద్యకు మరింత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ)లో ‘డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్స్)’పై రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటేశం హాజరై ప్రారంభించి ప్రసంగించారు. టెక్నాలజీ, ట్రెడిషన్స్, టాలెంట్లలో తెలంగాణ ముందుందన్నారు. దేశవ్యాప్త డిజిటల్ విద్య అవసరాల్లో నాలుగోవంతు తెలంగాణ తీర్చనున్నదని చెప్పారు. ఈఎంఆర్సీ ద్వారా డిజిటల్ విద్యావిధానానికి ప్రాధాన్యత ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ (సీఈసీ) డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ భూషణ్ నడ్డా మాట్లాడుతూ 2035 వరకు విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తిని 50శాతానికి పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
కొద్ది రోజుల్లోనే డిజిటల్ యూనివర్సిటీ స్థాపన మన దేశంలోని విద్యావ్యవస్థను మరో దశకు తీసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అధ్యాపకులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని డిజిటల్ టీచింగ్ అండ్ లర్నింగ్‌కు మారాల్సిన అవసరాన్ని వివరించారు. ఈఎంఆర్సీ డైరెక్టర్ పి.రఘుపతి మాట్లాడుతూ విద్యార్థులకు అందించే పాఠ్యాంశాలను డిజిటలైజ్ చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ జి.మల్లేశం, ప్రొఫెసర్ రాములు, ప్రొఫెసర్ రాజేంద్రనాయక్, ప్రొఫెసర్ శ్రీనగేశ్, ప్రొఫెసర్ ప్యాట్రిక్ పాల్గొన్నారు.