ఖైరతాబాద్, డిసెంబర్ 10 : కరోనా కష్టకాలంలో అన్నార్తులను ఆదుకోవడం సేవకు నిర్వచనమని డీఐజీ (సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్) బి.సుమతి అన్నారు. శుక్రవారం లక్డీకాపూల్లోని హోటల్ వెంకటేశ్వరలో గజ్వేల్ శ్రేయోభిలాషులు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీఐజీ సుమతి ముఖ్య అతిథిగా హాజరై ఆ సంస్థ ప్రతినిధులను ‘సేవా శిరోమణి’ అవార్డులతో సత్కరించారు. అనంతరం డీఐజీ సుమతి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో వలస కూలీల కృషి ఉంది. వారు మనవారే.. వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకొని పోలీసుల ద్వారా చేపట్టిన సేవా ఆహార్ కార్యక్రమంతో ఎందరో ఆకలి తీర్చారన్నారు. అనంతరం శ్రేయోభిలాషులు ప్రతినిధులకు పోలీసు శాఖ తరఫున సేవా ప్రతిభా సర్టిఫికెట్లను అందించి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు విష్ణు జగతి, సంస్థ చైర్మన్ కె.వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పోరెడ్డి మల్లేశం, సహాయ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, సభ్యులు కుమార్, ఫణి, జగతి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.