సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్, పోలీస్ శాఖాధికారుల సమన్వయంతో దూల్‌పేట పరిసర ప్రాంతాల్లో గంజాయి దందా పూర్తిగా బంద్ అయ్యింది. నెల రోజుల వ్యవధిలో రెండు విభాగాల అధికారులు 59 కేసులు నమోదు చేసి 75 మందిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సైతం ఉన్నతాధికారులు సహించడం లేదు. రహస్య విచారణ జరిపి వేటు వేస్తున్నారు. ఇందులో భాగంగా దూల్పేట్ ఇన్స్పెక్టర్ రన్వీర్రెడ్డి, ఎస్ఐ రామ్‌నాయుడు, షాషినాయత్గంజ్ ఎస్ఐ వెంకట్ కిషన్‌ను సీపీ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత దూల్‌పేట పరిసర ప్రాంతాల్లో గుడుంబా అడ్డాలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. గుడుంబా విక్రయాలనే ఆధారం చేసుకొని బతుకుతున్న వారికి పునరావాసం కల్పించింది. దీంతో దూల్‌పేట గుడుంబా ఫ్రీగా మారింది. అయితే ఆ ప్రాంతంలో అక్కడక్కడ గంజాయి అడ్డాలూ కొనసాగుతుండగా.. ఈ సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి వాటిని పూర్తిస్థాయిలో నిర్మూలించాలని గత నెలలో ప్రణాళికలు సిద్ధం చేశారు.
గంజాయి విక్రయించే ప్రధాన ముఠాలు ఎన్ని? వీటికి గంజాయి సరఫరా చేస్తున్న వారు ఎవరు? ఈ ముఠాల వద్ద కొంటున్న వారి సమాచారాన్ని సేకరించారు. అంతేకాక గంజాయి విక్రయించే వారిని గుర్తించేందుకు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఒకే రోజు ప్రధాన అడ్డాలపై పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా దాడులు జరిపారు. గంజాయి కొనేందుకు వచ్చే యువత, విద్యార్థులను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 400 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
బంజారాహిల్స్, అక్టోబర్ 12: గంజాయి అమ్ముతున్న ఒకరిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.. బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని సయ్యద్‌నగర్‌లో నివాసముంటున్న షేక్ సయిదుల్ హుసేన్ అలియాస్ సూరజ్ (31) డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్న సూరజ్ కొంతకాలంగా దూల్‌పేట నుంచి గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 32 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): గంజాయి విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని గడిచిన కొన్ని నెలల్లో 23 మందిపై పీడీ యాక్టు ప్రయోగించామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. గంజాయికి సంబంధించిన విక్రయాలపై స్థానిక ప్రజలు స్థానిక పోలీస్స్టేషన్లు, పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ పోలీసులతో పాటు 9490616555 నంబర్‌కు వాట్సాప్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. అందరం కలిసి నగరాన్ని గంజాయి రహితంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.