ప్రతి ఇల్లూ, ప్రతి గడపా నాకు అండగా నిలుస్తాయి. కార్పొరేటర్‌గా రెండు పర్యాయాల అనుభవం ఉంది. స్థానికంగా ప్రజల సమస్యలపై అవగాహన ఉంది. తెలంగాణ రాక ముందు పాతబస్తీ ఎట్లా ఉందో? ఇప్పుడెట్లా ఉందో.. ఆ తేడా ఏమిటో నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు అండతోనే నా గెలుపు షురూ అవుతున్నది.
అబిడ్స్, సెప్టెంబర్ 1 : గత ప్రభుత్వాలెన్నో పాలన అందించినా పాతబస్తీని పట్టించుకున్న మెరుగైన స్థితిగతులు లేవు. పాలనా వ్యవస్థ అంతా పాతబస్తీ అనగానే ఆమడ దూరం ఉండేది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పాతబస్తీ సైతం అభివృద్ధి పథంలోకి వచ్చింది. ఎన్నో మెరుగైన సౌలతులు, వసతులు పాతబస్తీ వాసులకు అందుబాటులోకి వచ్చాయి. పాతబస్తీకి చెందిన కార్వాన్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అనేక అభివృద్ధి పనులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో కార్వాన్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చోటు చేసుకున్నది. కార్వాన్ నియోజకవర్గానికి చెందిన అన్ని వర్గాల వారికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా లబ్ధి చేకూరగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారు. నియోజకవర్గంలోని జియాగూడలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, స్లాటర్ హౌజ్ ఆధునీకరణతో నిర్మించేందుకు నిధుల విడుదలతో పాటు అనేక అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. లంగర్ హౌజ్, గోల్కొండ, నానల్‌నగర్, కార్వాన్, గుడి మల్కాపూర్, జియాగూడ తదితర ప్రాంతాలలో పలు రహదారుల వెడల్పు, నూతన రహదారుల నిర్మాణం, ప్రజలకు పౌర సదుపాయాలను మెరుగుపర్చడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యమైంది. ఈ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడుతూ వస్తున్నది. కార్వాన్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించిన మాజీ కార్పొరేటర్ మిత్ర కృష్ణ నమస్తే తెలంగాణతో చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి..
అభ్యర్థిగా ప్రకటించి.. దళితులకు న్యాయం చేశారు..
పార్టీ అధిష్టానవర్గం నన్ను కార్వాన్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉంది. దళితులకు ప్రాధాన్యత ఇచ్చి తనను అభ్యర్థిగా ప్రకటించడంతో దళితులకు న్యాయం చేసినట్లయ్యింది. రెండు సార్లు కార్పొరేటర్‌గా విజయం సాధించిన తాను ప్రజల సమస్యల పరిష్కారానికి పాటు పడుతూ వచ్చాను. ప్రజలకు ఎల్లవేలలా అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేశాను. నా సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ నాకు అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలలో విశ్వాసం ఎలా ఉంది?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొమ్మిదిన్నరేండ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగింది. కోతలు లేని విద్యుత్ సరఫరా, ఉచితంగా మంచినీటి సరఫరా, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఋణ మాఫీ, కేసీఆర్ కిట్స్, ఆసరా పెన్షన్లు, దళిత బంధు, బీసీలు, మైనార్టీలకు ఆర్థిక సహాయం వంటి అనేక పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారు. పాతబస్తీ వంటి అనేక ప్రాంతాలలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కింది. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంతో పాటు రహదారుల విస్తరణ, రహదారుల నిర్మాణం పౌర సదుపాయాలను మెరుగు పర్చడం వంటి పనులను చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలలో చెక్కు చెదరని ఆదరణ ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించి తిరిగి పట్టం కట్టి హ్యాట్రిక్ సాధించడం ఖాయం.
కార్పొరేటర్‌గా ఎన్నో సమస్యలకు పరిష్కారం..
రెండు సార్లు కార్పొరేటర్‌గా కార్వాన్ నియోజకవర్గంలోని జియాగూడ డివిజన్‌కు ప్రాతినిధ్యం వహించి అనేక అభివృద్ధి పనులు చేపట్టాను. ప్రజల సమస్యలను తెలుసుకుని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలు పరిష్కారమయ్యేలా చూశాను. గుర్తించిన పార్టీ అధిష్టానవర్గం కార్వాన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలలోకి వెళ్లి పార్టీ విజయం సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తాను.
గడప గడపా.. నాకు అండగా..
తప్పక విజయం సాధిస్తాను. కార్వాన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీ కూడా పోటీ కాదు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు ఆదరించి తనను గెలిపిస్తారని ధీమాగా ఉన్నాను. నియోజకవర్గంలోని గడప, గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థిస్తాను.
సంక్షేమ పథకాలే..గెలుపునకు దోహదం
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపడుతున్న సంక్షేమ పథకాలే తన గెలుపుకు దోహద పడ్తాయి. ప్రభుత్వ పథకాలతో ప్రజలలోకి వెళ్లి పార్టీకి పట్టం కట్టాలని కోరతాను. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. ఆయా పథకాలతో అనేక మంది లబ్ధి పొందుతున్నారు. ఆయా పథకాలను ప్రజలకు వివరించి ఓటు వేయాలని అభ్యర్థిస్తాను.
గెలిస్తే.. పథకాలు ఇంటింటికీ అందేలా చూస్తా..
కార్వాన్ నియోజకవర్గం ప్రజల సహకారంతో తప్పక విజయం సాధిస్తాను. ప్రభుత్వం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా, ఇంకా ఇంటింటికీ అందేలా చూస్తాను. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి పాటు పడ్తాను. కార్వాన్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పాటు పడి నగరంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. భారీ ప్రాజెక్ట్‌లను నియోజకవర్గంలో చేపట్టేందుకు పాటు పడ్తాను.