సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని ఎమ్మార్వో కార్యాలయాల్లో సేవలు ఏ విధంగా అందుతున్నాయి? నిర్ణీత సమయంలోపు సంబంధిత ధ్రువపత్రాలు జారీ అవుతున్నాయా? పెండింగ్లో దరఖాస్తులకు కారణాలు? ఇలా తదితర అంశాలన్నింటిపై వివరాలు సేకరించి సదరు కార్యాలయాలకు డిప్యూటీ కలెక్టర్లు మార్కులు ఇస్తున్నారు.
ఆ మార్కుల ఆధారంగా సిబ్బందిపై చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్ కలెక్టర్ ఆదేశాలనుసారం డిప్యూటీ కలెక్టర్లు వారానికి మూడు ఎమ్మార్వో కార్యాలయాలను తనిఖీ చేసి వివరాలు సేకరిస్తారు. ఆ వివరాల ఆధారంగా కలెక్టర్కు నివేదిక ఇస్తున్నారు. పలు సేవల జాబితానుసారం వంద మార్కులుగా నిర్ణయించి.. కార్యాలయాల పరిస్థితిని పరిశీలించి మార్కులు వేస్తున్నారు. ఇందులో 60కి తక్కువగా ఉంటే సదరు అధికారులపై చర్యలు తీసుకోనున్నారు. కార్యాలయానికి వస్తున్న ప్రజల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుంటున్నామని ఓ అధికారి తెలిపారు.