ఘట్కేసర్, జనవరి 17 : ఘట్కేసర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా పలు ప్రాంతాల్లో నిర్మించిన నిర్మాణాలను జేసీబీ సహాయంతో సోమవారం కూల్చివేశారు. పంచాయతీ అనుమతి ఉండి, మున్సిపాలిటీ అనుమతి లేకపోవడం,అసలు అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం పై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో హెచ్ఎండీఏ, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు పోలీసుల సహాయంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూల్చివేతలు నిర్వహించారు. ఘట్కేసర్ పరిధిలోని సర్వే నంబర్ 581, 417, 654లలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. ఏఈ శ్రీనివాస్, టీపీఎస్ కావ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి నిర్మాణానికి అనుమతి పొందాలి : చైర్పర్సన్
మున్సిపాలిటీ పరిధిలో ప్రతి నిర్మాణానికి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ తెలిపారు. అనుమతులు లేని నిర్మాణాలను అధికారులు కూల్చివేశారని తెలిపారు. మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకొని వెంటనే అనుమతి పొంది నిర్మాణాలు చేసుకుంటే ఎలాంటి కూల్చివేతలు ఉండవని ఆమె సూచించారు.