కుత్బుల్లాపూర్, జూన్ 8: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి తుమార్చెరువు అలుగు ఆక్రమణలను కలెక్టర్ ఆదేశాలతో శనివారం ఇరిగేషన్, రెవెన్యూ, కొంపల్లి మున్సిపాలిటీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సర్వే నంబర్ 2,3,4లో తుమార్ చెరువు నిండితే అలుగు పారేందుకు అనువుగా ఉండేది. దీంతో అక్కడి పట్టాదారులు భూముల అభివృద్ధి కోసం అమ్మకాలు చేపట్టిన తర్వాత బిల్డర్లు నిబంధనలకు విరుద్ధంగా స్థలాల చుట్టూ గోడలను కాంక్రీట్ నిర్మాణంతో చేపట్టారు. దీంతో భవిష్యత్‌లో చెరువు అలుగులు పారితే దూలపల్లి గ్రామం పూర్తిగా నిండిపోయే ప్రమాదం పొంచి ఉన్నదని, దీనికి తోడు చెరువు ఆయకట్టు కింద నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పెద్దపెద్ద బహుళ అంతస్తుల నిర్మాణాలకు సైతం ప్రమాదాలు తప్పవని గ్రహించిన గ్రామస్తులు..ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు తెలిపారు.
దీంతో ఆయన జిల్లా కలెక్టర్ గౌతమ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్.. దుండిగల్-గండిమైసమ్మ తహసీల్దార్ మతిన్‌కు ఆదేశాలు జారీ చేయడంతో ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కె. శ్రీహరి, టీపీఓ రాజారెడ్డితో పాటు సిబ్బంది రంగంలోకి దిగి ఆక్రమణలను నేలమట్టం చేశారు. ఇదిలా ఉంటే మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూల్చివేతల ప్రాంతాన్ని అనుచరులు, గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. అధికారులు త్వరితగతిన చెరువు అలుగులు పారేందుకు నక్షా ప్రకారం మార్కింగ్‌లు వేసి ఇవ్వాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కావాల్సిన అభివృద్ధి పనులను మంజూరు చేయించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మైనంపల్లి హన్మంతరావు అన్నారు.
తుమార్ చెరువు పైభాగం పూర్తిగా మట్టిపోసి.. వ్యాపార సముదాయాలు వెలిశాయని, అధికారులు సంయుక్తంగా పరిశీలన చేపట్టి చెరువులో వెలసిన అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంతో పాటు ఇక్కడ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను నిలిపివేయాలని మేడ్చల్ రెవెన్యూ అధికారులతో పాటు గుండ్లపోచంపల్లి కమిషనర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే తుమార్ చెరువు రెండేండ్లుగా ఆక్రమణకు గురవుతున్నది. ఈ చెరువును కాపాడటంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే చెరువు సగం వరకు మట్టిపూడ్చి కబ్జా చేయగా, చెరువు కిందిభాగంలో అలుగు పారే ప్రాంతాలను పూర్తిగా కాంక్రీట్‌తో గోడలను నిర్మించారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు స్పందించి శనివారం ఆక్రమణలను నేలమట్టం చేశారు.