స్టార్టప్‌లకు పెట్టుబడిదారుల అండ
సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీ -ఏంజిల్ ఆధ్వర్యంలో టీ హబ్‌లో సోమవారం డెమో డే నిర్వహించారు. స్టార్టప్‌ల నిర్వాహకులు పెట్టుబడి దారులతో నేరుగా సమావేశమై తమ వ్యాపార ఆలోచన, విస్తరణ కార్యకలాపాలపై చర్చించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని టీ హబ్ సీఈఓ ఎం.ఎస్.రావు తెలిపారు. స్టార్టప్‌లను స్థాపించింది మొదలుకొని, దానికి నిధులు సాధించేందుకు ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నారు. చక్కని ఆలోచనలతో ప్రారంభించిన స్టార్టప్‌లను విజయవంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం వ్యాపార ప్రణాళికలను సమర్థవంతంగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఇవన్నీ సాఫీగా జరిగేలా ఇలాంటి కార్యక్రమం స్టార్టప్‌లకు తోడ్పడుతుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారానే స్టార్టప్‌ల రంగంలో ఉన్న ఎంతో మందికి నిధులు సమకూర్చుకోవడం చాలా సులభంగా మారుతుండగా, స్టార్టప్ వ్యవస్థాపకులు పూర్తిగా దాని నిర్మాణంపై ప్రధానంగా దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
టీ హబ్‌లో ఐడియా ఓపెన్ హౌస్
ఐడియా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని సోమవారం టీ హబ్‌లో నిర్వహించారు. సరికొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు చేయాలన్న ఆసక్తి ఉన్న వారు నిపుణుల ఎదుట తమ ఆలోచనలను పంచుకున్నారు. ప్రతి నెల టీ హబ్‌లో ఐడియా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఐడియా ఓపెన్ హౌస్‌లో సుమారు 40 మంది తమ ఆలోచనలను నమోదు చేసుకున్నారని టీహబ్ నిర్వాహకులు తెలిపారు.