మహానగరం ప్రజలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్నికల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మెరుగైన జీవన ప్రమాణాలను అందించాలనే సంకల్పంతో అటవీ శాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా గాజులరామారం సర్కిల్ పరిధిలోని అటవీ ప్రాంతాలను పార్కులుగా తీర్చిదిద్ది ఆహ్లాదకరంగా మార్చింది.ఎటు చూసినా పచ్చని అందాలతో కూడిన ప్రాంతాలను పర్యాటకులకు అనుగుణంగా అభివృద్ధి చేశారు.
– దుండిగల్/కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 22
గాజులరామారం సర్కిల్ పరిధిలోని గాజులరామారం, సూరారం బౌరంపేట్ రోడ్డులో ఉన్న 454 హెక్టార్లలో ఉన్న అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన రెండు పార్కులు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, వినోదాన్ని పంచుతున్నాయి. గాజులరామారంలో 60 ఎకరాల్లో ప్రాణవాయువు అర్బన్ ఫారెస్ట్ పార్క్లో అన్ని హంగులతో మెరుగైన వసతులు ఏర్పాటు చేశారు. వాకింగ్, సైక్లింగ్ట్రాక్, వాష్రూమ్స్, యోగాషెడ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, రెండు ఓపెన్ క్లాస్రూంలు, పిక్నిక్ ఏరియా వంటి ప్రదేశాలను తీర్చిదిద్దారు.
అందాల అడవులు గాజులరామారం సర్కిల్ పరిధిలో ఉన్న ఆయా ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలను వృద్ధులు, చిన్న పిల్లలకు అనుగుణంగా రెండు పార్కులు తీర్చిదిద్దారు. వీకెండ్లో కుటుంబాలతో సరదాగా గడిపేందుకు చక్కటి అందాలతో కూడిన వాతావరణాన్ని కల్పించారు. గాజులరామారం చింతల్ చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన పలు మౌలిక వసతులతో ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు నిత్యం ఇక్కడ తీరొక్క పక్షులు సందడి చేస్తున్నాయి.
గాజులరామారం సర్కిల్ పరిధిలో ఇప్పటి వరకు అటవీ, ఇతర పార్కులను ప్రజలకు చేరువలో చేసేందుకు సకల సౌకర్యాలను కల్పించాము. వీటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆయా ప్రాంతాలు, పార్కులు నిత్యం ప్రజలతో సందడిగా కనబడుతున్నాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడం కోసం నిరంతరం తగు జాగ్రత్తలు తీసుకుంటాం.
– ప్రశాంతి, ఉపకమిషనర్,గాజులరామారం సర్కిల్