ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 25 : రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ఎజెండాగా ముందుకు సాగుతోందని చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశాన్ని సీతాఫల్మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పద్మారావు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ కొత్త పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఇతర రాష్ర్టాల ప్రజలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవహేళన చేసిన వారికి సైతం విస్మయం కలిగించేలా పాలన కొనసాగుతుందని కొనియాడారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో పరిపాలన దక్షతను చాటుకున్నారని ప్రశంసించారు. ఆయనను అణిచివేసేందుకు వివిధ జాతీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి సహాయ నిరాకరణ చేస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కేసీఆర్‌కు ఆదరణ పెరుగుతోందని చెప్పారు. తెలంగాణలో మరోసారి కేసీఆర్ సర్కారు రావడం తథ్యమని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, లింగాని ప్రసన్న, రాసూరి సునీత, బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.