సోనీది ప్రమాదం కాదు.. ముమ్మాటికీ యాజమాన్య హత్యే
రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబురాల పేరుతో నిర్వహించిన ఈవెంట్ విద్యార్థినుల పాలిట బలిపీఠంగా మారిందని, ఇది ముమ్మాటికీ యాజమాన్యం చేసిన హత్యేనని ప్రముఖ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు.
- ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం
- బాధితులకు చెరొక రూ. కోటి పరిహారం చెల్లించాలి
- యాజమాన్యంపై నాన్-బెయిలబుల్ కేసులు పెట్టాలని డిమాండ్
సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ) : రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబురాల పేరుతో నిర్వహించిన ఈవెంట్ విద్యార్థినుల పాలిట బలిపీఠంగా మారిందని, ఇది ముమ్మాటికీ యాజమాన్యం చేసిన హత్యేనని ప్రముఖ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. ఈ దుర్ఘటనలో వనపర్తి జిల్లాకు చెందిన బడుగు, బలహీన వర్గాల విద్యార్థిని సోని ప్రాణాలు కోల్పోగా, మరో విద్యార్థిని మీనా తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య పోరాడుతున్న ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.
వేలాది మంది విద్యార్థులతో కార్పొరేట్ విద్యాసంస్థలు ఈవెంట్లు నిర్వహిస్తూ వినోద వ్యాపారం చేస్తున్నాయని, అసలు ఎలాంటి అనుమతులు లేకున్నా స్థానిక పోలీసులు, విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ఎమ్మెల్సీ శ్రవణ్ నిలదీశారు. ప్రభుత్వ కళ్లెదుటే భద్రతా నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. కనీసం ఫైర్ సేఫ్టీ లేదని, క్రౌడ్ కంట్రోల్ చర్యలు శూన్యమని, అత్యవసరానికి అంబులెన్స్ కూడా అందుబాటులో లేకుండా వ్యవహరించడం దారుణమన్నారు. టికెట్ల ద్వారా సొమ్ము వసూలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈవెంట్లను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ పాలనా వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. దాదాపు రూ. 50 లక్షల ఫీజులు గుంజి, పేద విద్యార్థుల ప్రాణాలను గాలికొదిలేసిన కాలేజీ యాజమాన్యంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఉదాసీనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని పేరొన్నారు.
ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్లు
యాజమాన్యం నిర్లక్ష్యానికి బలైన విద్యార్థిని సోని కుటుంబానికి కళాశాల నిధుల నుంచి రూ. 1 కోటి, తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్న మీనాకు రూ. 1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. బాధితుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
క్రిమినల్ నిర్లక్ష్యానికి కారణమైన కాలేజీ సెక్రటరీ, కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఈవెంట్ నిర్వాహకులపై బీఎన్ఎస్ హత్య నేరం కింద తీవ్ర సెక్షన్లతో నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి.
తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో ఉన్న మీనాకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించి మెరుగైన వైద్యం అందించాలి.
విద్యను వ్యాపారంగా మార్చి నిబంధనలను ఉల్లంఘించిన ఎంవీఎస్ఆర్ కళాశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలి. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి.
కార్పొరేట్ యాజమాన్యాలకు కొమ్ముకాయడం మానుకుని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
ఎంవీఎస్ఆర్ కళాశాల వద్ద ఉద్రిక్తం
- కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా
- మృతి చెందిన విద్యార్థిని సోని కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలి
బడంగ్పేట్, అక్టోబర్18 : మహేశ్వరం నియోజకవర్గం, నాదర్గుల్లో ఉన్న ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం రాత్రి జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత కళాశాల యాజమాన్యం వహించాలని విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీలు, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఆదివారం కళాశాల ముందు ధర్నా చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల లోపలికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మృతిచెందిన సోని కుటుంబ సభ్యులు రావడంతో కళాశాల దగ్గర ఆందోళన తీవ్ర అయింది. దీంతో మీర్పేట్, బాలాపూర్ సీఐలు శోభన్, నాగరాజుల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనకు కళాశాల యజమాన్యం బాధ్యత వహించాలని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈవెంట్ మేనేజర్, కళాశాల యజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదిబట్ల సీఐ రమేశ్ తెలిపారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..
శనివారం రాత్రి ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన లైటింగ్ సిస్టమ్ కూలిపోయిన ఘటనలో సోని అనే విద్యార్థిని మృతి చెందగా మరో 22 మంది గాయపడటానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, సీపీఐ, బహుజన విద్యార్థి సంఘం, ఏబీవీపీ, తదితర విద్యార్థి సంఘాలు, సీపీఎం, సీపీఐ, బీజేపీ పార్టీలు డిమాండ్ చేసి కళాశాల ముందు ధర్నా చేశాయి. పోలీసుల అనుమతి లేకుండా కళాశాలలో ఈవెంట్ ఎలా నిర్వహిస్తారని వారు ప్రశ్నించారు. మరణించిన విద్యార్థిని సోనికు రూ.10 కోట్లు, గాయపడిన విద్యార్థులకు వైద్య ఖర్చులు కళాశాల యాజమాన్యం భరించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో విద్యార్థిని సోని మృతి చెందగా, 22 మంది విద్యార్థులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ధర్నాలో సీపీఎం నాయకులు నర్సింహ, దాసిరి బాబు, బీజేపీ నాయకులు నిమ్మల శ్రీకాంత్ గౌడ్, ఇంద్రసేన, ఏనుగు రాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఐలయ్య, బహుజన నాయకులు ఇంద్ర, సూర్ణ గంటి రంజిత్, తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ సభ్యుల ఆందోళన
ఎంవీఎస్ఆర్ కళాశాల ముందు సోని తండ్రి అశోక్, తల్లి లక్ష్మితో పాటు కుటుంబ సభ్యులతో బీజేపీ నాయుడు అందెళ శ్రీరాములు ధర్నా దిగారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి లేచే ప్రసక్తి లేదన్నారు. మృతదేహానికి పోస్టు మార్టం చేయనివ్వకుండా అడ్డుకున్నారు. ఉస్మానియా మార్చురీ నుంచి నేరుగా కళాశాల వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో కళాశాల దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
గాయపడిన విద్యార్థులు వీరే..
మైథిలి, సౌజన్య, తరుణి, స్పందన, అనన్య, అక్షర, స్లోక, అనుగుణ, శ్రావ్య, సుస్మిష, శ్రేష్ఠ, సానియా, హాసిని, యన్, మీన, సింధు, దీక్షిత, తన్మయి, సాత్విక, వైష్ణవి శర్మ, సహన గాయపడ్డారు. వీరిలో ఆరు మంది విద్యార్థులు మలక్పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన విద్యార్థులకు ప్రమాదం ఏమి లేదని పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

