సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణలో హెచ్ఎండీఏ ఎంతో కీలకం. మాస్టర్‌ప్లాన్ రూపకల్పన నుంచి మొదలుకొని వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులు, కొత్త లే అవుట్లు, భారీ బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతులు, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం… అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్, ఔటర్ రింగు రోడ్డు… ఇలా ఎన్నో రకాల కార్యకలాపాలు చేపడుతున్న హెచ్ఎండీఏపై కొత్త ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిని సారించింది.
ఇప్పటి వరకు హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి 2019 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి స్థానంలో కొత్త ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి స్థాయి కలిగిన ఐఏఎస్ అధికారిని హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్‌గా దాన కిశోర్‌ను నియమించగా, రెండు రోజుల కిందట కార్యదర్శి స్థాయి అధికారిణి అయిన ఆమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా నియమించింది.
4 ఏండ్లుగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి స్థానంలో ఒకేసారి ఇద్దరిని నియమించడం ద్వారా ప్రభుత్వం హెచ్ఎండీఏకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కంటే హెచ్ఎండీఏ పరిధిలోనే భవిష్యత్ అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే నగర శివారు ప్రాంతాల్లో పట్టణీకరణతో పాటు మెరుగైన మౌలిక వసతుల కల్పన విషయంలో సమగ్రంగా అధ్యయనం చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు సమర్థవంతమైన అధికార యంత్రాన్ని నియమించినట్లు తెలుస్తోంది.
భవిష్యత్‌లో రీజినల్ రింగు రోడ్డు…
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు తరహాలోనే 7 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న హెచ్ఎండీఏ పరిధి చుట్టూ ప్రాంతీయ వలయ రహదారి( రీజినల్ రింగు రోడ్డు-ఆర్ఆర్ఆర్) నిర్మాణ ప్రతిపాదనలు పురోగతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డుల మధ్య ఉన్న ప్రాంతంలో పట్టణీకరణ ఎలా ఉండాలన్న దానిపై ప్రత్యేక అధ్యయనం చేయనున్నారు.
జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి 
జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన బదిలీల్లో భాగంగా 2002 బ్యాచ్‌కు చెందిన సి. సుదర్శన్‌రెడ్డిని ఎంఏయూడీ సెక్రటరీ నుంచి జలమండలికి బదిలీ చేసింది. జలమండలిలో సుదీర్ఘ కాలంపాటు పనిచేసిన ఎండీ దానకిశోర్‌ను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది.