
దళిత బంధు పథకం ప్రకటనపై దళిత, ఉద్యోగ సంఘాల నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. హుజూరాబాద్ సభలో సోమవారం దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించడం, దీంతో పాటు ఈ పథకం దళితుల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్తింపజేయనున్నట్లు ప్రకటించడంతో ఆయా వర్గాలు మంగళవారం నగరవ్యాప్తంగా సంబురాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్‌ను అభినవ అంబేద్కర్గా అభివర్ణించారు.
షాబాద్, ఆగస్టు 17: దళిత బంధు పథకాన్ని దళిత ఉద్యోగులకు సైతం ఇస్తామని హుజురాబాద్ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీమని రంగారెడ్డి జిల్లా టీఎన్జీవో ఉద్యోగులు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వద్ద వారు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…సీఎం కేసీఆర్‌కు తమ సంఘం తరుఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం తలపెట్టిన ప్రభుత్వ ఉద్యోగులుగా మా కర్తవ్యాన్ని నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా కృషి చేయాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. లక్ష్మణ్, బుచ్చిరెడ్డి, కోశాధికారి విజయ్‌కుమార్, సంజయ్‌నాయక్, చంద్రశేఖర్, నరసింహ, రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
సుల్తాన్‌బజార్,ఆగస్టు 17: దళితుల అభివృద్ధికి దళితబంధును ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ పేర్కొన్నారు. మంగళవారం నాంపల్లి గృహకల్ప ఆవరణలోని జిల్లా శాఖ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని యూసుఫేయిన్ బాబా దర్గాలో ఛాదర్‌ను సమర్పించారు. అం తేకాకుండా ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక బోనాలను సమర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ కార్య దర్శి ఎస్ విక్రమ్ కుమార్,ఉపాధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్,సభ్యులు కె. శ్రీనివాస్,ఎస్ మురళిరాజ్,బి.శంకర్, సుజాత,గీత సింగ్,జానకి,ఎంఏ.ముజీబ్, సదానందంతో పాటు పలు యూనియన్ల అధ్యక్ష,కార్యదర్శులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు కూడా దళితబంధు వర్తింపజేసేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి. దళితుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే దళితబంధు పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాన్ని తలపెట్టినా ప్రభుత్వ ఉద్యోగులుగా మా కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకువస్తాం. – టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కె.లక్ష్మణ్
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎంకేసీఆర్కే దక్కింది. సీఎం అన్ని వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నారు. ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసినా దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌లో సీఎం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన కుటుంబాలు అభ్యున్నతి దిశలో పయనిస్తాయి. – అరుణ్‌కుమార్, రాష్ట్ర కురుమ యువత అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఎంతో మహోత్తమమైనది.గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటి సారిగా దళితబంధును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో దళితుల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ర్టాలకు స్ఫూర్తిదాయకం. -సల్వది శ్రీరాం,టీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు
రాబోయే రోజుల్లో దళిత బంధు పథకం దేశానికే దారి చూపనున్నది. దళితుల జీవన స్థితిగతిని మార్చే దళిత బంధు పథకం చరిత్రకెక్కనున్నది. ఉద్యోగులకు దళిత బంధును అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం.పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు. – డాక్టర్ ఎస్ఎం.ముజీబ్ హుస్సేనీ,టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు
దళిత సాధికారత సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం అవుతుంది. దళితబంధు పథకం ప్రవేశపెట్టే ముందు సీఎం కేసీఆర్ మాతో చర్చించారు. ఉద్యోగ,ప్రజా,కుల సంఘాలు ప్రతినిధులు, అధికారులతో సమాలోచనలు చేసి సహసోపేతమైన నిర్ణయం తీసుకొని ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించడం గొప్ప విషయం. ఇలాంటి నిర్ణయం గతంలో ఏ సీఎం తీసుకోలేదు. దళిత పక్షపాతిగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. దళితబంధుతో ఆ కుటుంబాల్లో కష్టాలు,కన్నీలకు ఇక చరమ గీతం పలుకనున్నది. యూనియన్ తరుఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. -టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ ఉపాధ్యక్షుడు పర్వతాలు
సీఎం కేసీఆర్ దళితుల నిజమైన ఆత్మబంధువు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, పాలకులు మారారు. అందరూ మాటలకే పరిమితమయ్యారు. కేసీఆర్ ఒక్కడే చేతల్లో చూపారు. ఎన్నో ఏండ్లుగా దళితులు వెనుకబడి ఉన్నారు. దళితుల గురించి గానీ, వారి వాడల గురించి పట్టించుకోలేదు. దళిత బంధు కింద ఇచ్చే రూ.10 లక్షలతో వారి కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి. ఆ తర్వాత వచ్చే తరాలు అందరితో అన్ని వర్గాలతో సమానంగా జీవనం సాగిస్తారు.-బేరి రాములు, ఎస్బీఐ ఉద్యోగి, గుండ్లపోచంపల్లి
అంబేద్కర్ ఆశయాలను నేరవేర్చే విధంగా సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయం. బడుగు,బలహీన వర్గాల ఉద్యోగులను ఉన్నత స్థాయిలో చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యంగా కనబడుతుంది. ఉద్యోగులకు దళిత బంధు వర్తింపజేసే నిర్ణయం హర్షణీయం.- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు, బి.రవిప్రకాశ్
ఉద్యోగులకు దళిత బంధును వర్తింపజేసే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. వెనుకబడిన ఉద్యోగులకు దళిత బంధు వర్తింపుతో ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. అంబేద్కర్ ఆశయాలను అమలు చేసే నిర్ణయం సీఎం కేసీఆర్ తీసుకోవడం సంతోషం. సీఎం కేసీఆర్ నిర్ణయానికి తమంతా మద్దతుగా నిలుస్తాం. దళితుల ఆర్థికాభివృద్ధికి ఉద్యోగులుగా మా వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తాం.- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా టీఎన్జీవోస్ కార్యదర్శి, ప్రవీణ్‌గౌడ్