సిటీబ్యూరో, జులై 29 (నమస్తే తెలంగాణ): ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తూ కొత్తగా సైకిల్ పెట్రోలింగ్‌ను(Cycle patrol) ప్రారంభించామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు(CP Sudhir Babu) తెలిపారు. పోలీస్స్టేషన్ల పరిధిలో బ్లూకోల్ట్స్, పెట్రోకార్తో పాటు కొత్తగా సైకిల్ పెట్రోలింగ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ఒకో పోలీస్‌స్టేషన్‌కు 3 నుంచి 5 సైకిళ్లను పంపిణీ చేయడంతో సోమవారం నుంచి సిబ్బంది సైకిల్ పెట్రోలింగ్ మొదలు పెట్టారని వెల్లడించారు.
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్థానిక ఠాణా సిబ్బంది ఆయా ప్రాంతాలలో సైకిళ్ల ద్వారా పెట్రోలింగ్ చేస్తూ విజిబుల్ పోలీసింగ్‌ను మరింత పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు పోలీసుల సేవలను మరింత చేరువ చేయడంలో భాగంగా పెట్రోలింగ్‌ను ముమ్మరంగా నిర్వహిస్తున్నామన్నారు.
క్షేత్ర స్థాయి విధి నిర్వాహణలో మహిళా సిబ్బంది పాత్రను పెంచుతూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని తెలిపారు. దాంతో ఉత్సాహంగా బ్లూకోల్ట్స్, పెట్రో కార్, సైకిల్ పెట్రోలింగ్ విధులలో వారు భాగస్వాముల వుతున్నారని సీపీ అభినందించారు. మహిళలకు రక్షణగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయని, చిన్నారులు, వృద్దులపై నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. డయల్ 100, 112కు ద్వారా వచ్చే ఫిర్యాదులపై వేగగా స్పందిస్తున్నామన్నారు.