సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఓ కమిషనరేట్‌లోని సైబర్‌ఠాణాలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న అధికారికి ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తాను రిటైర్డ్ అదనపు ఎస్పీ నర్సింహారెడ్డిని మాట్లాడుతున్నానని, ప్రస్తుతం టీటీడీ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. ఇన్స్పెక్టర్ భార్య సంగీత కళాకారిణి కావడంతో ఒక ప్రోగ్రాంకు అవకాశం కల్పించాలని కోరాడు. దీంతో నర్సింహారెడ్డి తాను తిరుమలలో జరిగే నాదనీరాజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయిస్తానంటూ హామీ ఇచ్చాడు. ఇందుకు తన కొడుకు టీవీ లోకేశ్ అన్ని వ్యవహారాలు చూసుకుంటాడని అతడి ఫోన్ నంబర్‌ను పంపించాడు. ఇన్స్పెక్టర్ భార్య నర్సింహారెడ్డితో మాట్లాడింది.
తన స్టూడెంట్ ఒకరు కూడా ప్రోగ్రాంలో పాల్గొంటారని కోరింది. ఈ క్రమంలో ‘మీరు కోరుకున్నట్లే నాదనీరాజనం ప్రోగ్రాంకు 21న సమయం తీసుకున్నామని చెప్పాడు. గదులు బుక్ చేశామంటూ.. ప్రోగ్రాంతో పాటు వీఐపీ దర్శనలకు కొంత డబ్బు కావాలంటూ రూ. 1.62 లక్షలు నిందితులు వసూలు చేశారు. సైబర్‌నేరగాళ్లు రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తుండటంతో సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్కు ఈ వ్యవహారంపై అనుమానం వచ్చి…ఆరా తీయగా.. అలాంటి వ్యక్తులు తిరుమలలో లేరని తెలుసుకున్నాడు. చివరకు అంతా మోసమని పక్కా ప్లాన్‌తో సైబర్‌నేరగాళ్లు మోసం చేశారని గుర్తించిన ఇన్స్పెక్టర్.. రాచకొండ సైబర్‌క్రైమ్ ఠాణాలో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేపట్టారు.