సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దాదాపు 11 ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వరకు ఈనెల 13న రహదారిని పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణ పనులు దాదాపు మూడు నెలల పాటు కొనసాగనుండటంతో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు సైబరాబాద్ జాయింట్ సీపీ(ట్రాఫిక్) నారాయణ్ నాయక్ తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆయన ప్రధాన జంక్షన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు జారీచేశారు.