సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియాలో కాస్త పరిచయమైతే చాలు..ఉన్నత చదువులు చదివినవాళ్లు, మంచి ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు.. సైబర్‌నేరగాళ్ల వలలో పడిపోతున్నారు. అవతలి వ్యక్తిని ప్రత్యక్షంగా చూడకున్నా వాళ్లు చెప్పిన వివరాలన్నీ నిజమేనని గుడ్డిగా నమ్మి లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఇలా ఓ సైబర్ దొంగను నమ్మి నగరానికి చెందిన ఓ కంపెనీ సిస్టమ్ అడ్మిన్ ఏకంగా 10 లక్షలు సమర్పించుకున్నాడు. ఒక మల్టీనేషనల్ కంపెనీలో సిస్టమ్ అడ్మిన్‌గా పనిచేస్తున్న బాధితుడికి, 2024 డిసెంబర్లో లింక్డిన్ ప్లాట్ ఫాంలో ఓ సైబర్ దొంగ పరిచయమయ్యాడు.
తనను తాను సీనియర్ అనలిస్ట్‌గా పరిచయం చేసుకున్నాడు. ఫలానా కంపెనీలో పని చేస్తున్నానంటూ తన పేరు సహర్షారెడ్డి అంటూ నకిలీ వివరాలు చెప్పాడు. ఇదంతా నిజమేనని బాధితుడు నమ్మి అతనితో రోజూ ఆన్లైన్ లో మాట్లాడేవాడు. ఆ తరువాత ఒక రోజు సహర్షారెడ్డి టెన్షన్లో ఉన్నానని, తమ తల్లి, సోదరుడు ఇద్దరు దవాఖానాలో చేరారని, మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నానంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు ఆర్ధిక సహాయం కావాలంటూ కోరాడు. ఇదంతా నిజమని నమ్మిన బాధితుడు గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 20వ తేదీ వరకు దఫ దఫాలుగా రూ. 10,57,270 తన వద్ద ఉన్న డబ్బుతో పాటు తన స్నేహితుల క్రెడిట్ కార్డులు ఉపయోగించి అతనికి డబ్బులు డిపాజిట్ చేశాడు.
అతను ఇంకా డబ్బు కావాలంటూ అడుగుతుండడంతో అనుమానం వచ్చింది. బ్యాంకు మేనేజర్‌తో ఈ విషయంపై చర్చించడంతో ఇదంతా సైబర్ క్రైమ్ అని, ముక్కు మొఖం తెలియని వారితో ఇలాంటి లావాదేవీలు చేస్తున్నారంటూ అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆ తరువాత బాధితుడి గూర్చి ఆరా తీయడంతో అదంతా నిజమేనని, పక్కాప్లాన్‌తో సోషల్‌మీడియా వేదికగా తననకు సైబర్ఛీటర్ మోసం చేశాడని గుర్తించి రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.