హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): గండిపేట చెరువు సుందరీకరణ పనులు తక్షణమే చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్తో కలసి గండిపేట చెరువు సుందరీకరణ పనులపై ఆమె సమీక్షించారు. సుందరీకరణలో భాగంగా మొదటి దశలో వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన, పనులను వెంటనే చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. గండిపేట చెరువు చుట్టూ సుందరీకరణ పనులను చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. పనులలో భాగంగా పార్లను కూడా అభివృద్ధి చేయాలన్నారు. కోర్టులో కేసులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, హెచ్ఎండీఏ, ఎండోమెంట్, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.