బంజారాహిల్స్,సెప్టెంబర్ 10: రోడ్లమీద ఇష్టారాజ్యంగా చెత్తను పారవేస్తున్నారా.. ఎవరూ చూడడం లేదని తమ చేతిలోని చెత్త కవర్‌ను బైక్ మీద వెళ్తూ విసిరి కొడుతున్నారా..? అయితే మీరు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాల్సిందే. ప్రధాన రహదారులతోపాటు కాలనీ రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్తను పారవేసి తీవ్రమైన అపరిశుభ్ర వాతావరణానికి కారణమవ్వడమే కాకుండా, ప్రజారోగ్యానికి ముప్పు తెస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం వెస్ట్‌జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్.
మధురానగర్, బోరబండ పీఎస్‌ల పరిధిలో పర్యటించిన డీసీపీ విజయ్‌కుమార్ ఆయా ప్రాంతాల్లోని పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. అపరిశుభ్రతకు కారణమవుతున్న షాపులు, వ్యాపారసంస్థల నిర్వాహకులతో పాటు హోటళ్లు, ఇతర సంస్థల యాజమాన్యాలపై కఠినంగా ఉండాలని చెప్పారు. దీంతో పాటు నిత్యం చెత్తను రోడ్లపై పారవేసే వారిపై నిఘా పెట్టాలని, సీసీ కెమెరా ఫుటేజీలను సేకరించి వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తే ఉపేక్షించవద్దని చెప్పారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రధాన రోడ్లపై అక్రమణలు లేకుండా చూడాలని సూచించారు.