ఆర్కేపురం, అక్టోబర్ 8: కండ్లు మనిషికి చాలా ప్రధానమైనవని, అలాంటి కండ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మాక్సివిజన్ 19వ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిని శుక్రవారం సీపీ మహేష్ భగవత్, సినీ నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జీవితంలో అంధకారమైన జీవితమును ఊహించడానికి కూడా సాహసించమని, అందుకే కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలిపారు. మాక్సి విజన్ అనేది కంటి సంరక్షణకు గొలుసు లాంటిందని పేర్కొన్నారు. మాక్సి విజన్ క్లిష్టమైన కంటి జబ్బులకు చికిత్స చేయడానికి అధునాతన, అల్ట్రా- మోడరన్ టెక్నాలజీతో కంటి సంరక్షణకు సేవలందిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ వైద్యరంగంలో దూసుకెళ్తుందని చెప్పారు. కస్టమర్లకు తక్కువ ధరలకే నాణ్యమైన కంటి వైద్యం అందించి ప్రజల మన్ననలు పొందాలని ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో మాక్సి విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి కో-చైర్మన్ డాక్టర్ కాసు ప్రసాద్‌రెడ్డి, వి.ఎస్.సుధీర్, డాక్టర్ శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.