CV Anand | బంజారాహిల్స్ ఫిబ్రవరి 8: రోజురోజుకు మారుతున్న జీవనశైలి, రకరకాల కాలుష్యాలు తదితర కారణాలతో క్యాన్సర్ మహమ్మారి ఎవరికైనా సోకే అవకాశం ఉంటుందని, ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ క్యాన్సర్ నుంచి తప్పించుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ అన్నారు. బంజారాహిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం క్యాన్సర్ అవేర్నెస్ వాక్ ఏర్పాటు చేశారు. ఈ వాక్ ను జెండా ఊపి ప్రారంభించిన నగర సీపీసి వి ఆనంద్ మాట్లాడుతూ.. 25 ఏండ్ల కిందట తాను డీసీపీగా పనిచేస్తున్న సమయంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభమైందని, నాటి నుంచి నేటి వరకు లక్షలాది మంది రోగులకు క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారన్నారు.
గతంలో క్యాన్సర్ అంటే మరణం అనుకునేవారని, పెరుగుతున్న పరిశోధనలు, టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధికి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయన్నారు. శాస్తవ్రేత్తలు, వైద్యుల కృషితో అనేకమంది క్యాన్సర్ నుంచి బయటపడి క్యాన్సర్ విజేతలుగా ఇతర రోగులలో స్ఫూర్తి నింపుతున్నారన్నారు. ఆహార అలవాట్లు, వివిధ రకాలైన కాలుష్య కారణాల వల్ల ప్రతి ఒక్కరిపై క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని, నిరంతరం అప్రమత్తంగా ఉండటమే ముఖ్యమన్నారు. క్యాన్సర్ సోకిన వారికి సరైన సమయంలో గుర్తించి చికిత్స అందించాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులదే అన్నారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీఈవో డాక్టర్ కే కృష్ణయ్య, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫణి కోటేశ్వరరావు, డాక్టర్ కల్పనా రఘునాథ్ తోపాటు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.