సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రోజురోజుకు జఠిలంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించాలంటే రోడ్లపై ఉన్న ఆక్రమణలు, ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు అనివార్యమని, అందుకు స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేట్లు, ప్రజా ప్రతినిధులంతా సహకరించాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించడంలో భాగంగా నిర్వహించ తలపెట్టిన రోప్ (రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు)పై ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు, ఇతర శాఖల అధికారులతో పాతబస్తీ పురానీ హవేలీలోని పాత కమిషనరేట్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సమన్వయ సమావేశానికి సీపీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా సీపీ ఆనంద్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 88లక్షల వాహనాలు రోడ్లపై ప్రయాణిస్తున్నాయని, ప్రతిరోజు 1500కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నట్టు తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ఇప్పటికే పోలీసులు పలు రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అయితే చాలా చోట్ల నగర రోడ్లు, ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురికావడం, క్యారేజీ మార్గాల్లో, ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారని, దీని వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్టు సీపీ వివరించారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించాలంటే ఆక్రమణలను తొలగించడం అనివార్యమని పేర్కొన్నారు.
దీని కోసం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులందరూ సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, బలాల, మాజిద్ హుస్సేన్, కౌసర్ మోయినుద్దీన్, జాఫర్ హుస్సేన్, మహ్మద్ ముబీన్, స్థానిక కార్పొరేటర్లతో పాటు ట్రాఫిక్ అదనపు కమిషనర్ పి.విశ్వప్రసాద్, ట్రాఫిక్-3 డీసీపీ వెంకటేశ్వర్లు, సౌత్‌జోన్ డీసీపీ స్నేహా మెహ్రా, సౌత్ఈస్ట్ జోన్ పాటిల్ కాంతిలాల్ సుభాష్, జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ టి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.