సిటీబ్యూరో, జూన్ 29(నమస్తే తెలంగాణ): భార్యపై ప్రేమాభిమానాలుంటే వెంటనే వారికి ఒక హెల్మెట్ కొనివ్వండి.. ప్రేమించేవారు తప్పకుండా హెల్మెట్ కొనిస్తారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. హెల్మెట్ ప్రతి ఒక్కరూ వాడాలని, ద్విచక్రవాహనంపై వెనుక కూర్చునే వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. ద్విచక్రవాహనాలపై వెళ్లే దంపతులిద్దరూ హెల్మెట్లు ధరించాలన్నారు. మంగళవారం సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అంజనీకుమార్ పలు అంశాల గురించి మాట్లాడారు. వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోతాయని, వాహనదారులు వేగంగా వెళ్లకుండా నిదానంగా వెళ్లాలని సూచించారు. రానున్న బోనాల పండుగ సందర్భంగా పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం జరిగిందన్నారు. నగరంలో బోనాల పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని.. అందుకు క్షేత్ర స్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. స్థానికంగా ఎమైనా సమస్యలుంటే ఆ సమావేశాల్లో స్థానిక ప్రజలు పోలీసులకు తెలియజేయాలని సూచించారు. కరోనా నేపథ్యంలో బోనాల పండుగలో పాల్గొనే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యం బాగోలేనివారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆయా ఆలయ కమిటీల నిర్వాహకులు భక్తుల కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సూచించారు.
నకిలీ విత్తనాలు, గంజాయి, గుట్కా విక్రయాలపై నగరంలో నిరంతరం నిఘా కొనసాగుతుందని సీపీ అంజనీకుమార్ అన్నారు. గుట్కా విక్రయాల వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని, ఎవరు కూడా వాటిని విక్రయించవద్దని ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులకు, గోడౌన్లు, పాన్‌షాప్‌ల నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తాము రవాణా చేయమని, నిల్వ ఉంచుకోమని, విక్రయించమని వారు ప్రమాణాలు కూడా చేస్తున్నారని సీపీ తెలిపారు. జూన్‌లో 223 కేసులు నమోదు చేసి.. 299 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు.
ప్రతి పోలీస్‌స్టేషన్‌లో పనులను 17 వర్టికల్స్‌గా విభజించారు. ఒక్కో వర్టికల్‌కు ఒక్కో అధికారికి బాధ్యత అప్పగించారు. అప్పగించిన పనిని బాధ్యతగా, వేగంగా, పారదర్శంగా చేసిన వారికి ఉన్నతాధికారులు తగిన గుర్తింపునిచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా 17 వర్టికల్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని 2020 సంవత్సరానికి రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేశారు. ఇందులో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి 24 మంది ఎంపికయ్యారు. అందులో 9 మంది ఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్, 13 మంది కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు ఉన్నారు. ఎంపికైన వారికి సీపీ అంజనీకుమార్ మంగళవారం మెమోంటోలు అందించి వారికి అభినందనలు తెలిపారు.