సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): కోర్టు కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు కేసుల వివరాలు, పురోగతి తదితర అంశాలను సులువుగా తెలుసుకునేందుకు వీలుగా సైబరాబాద్ పోలీసులు ‘కోర్టు మానిటరింగ్’ యాప్‌ను ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ యాప్‌ను గురువారం కమిషనరేట్‌లోని తన చాంబర్లో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ యాప్ ద్వారా న్యాయస్థానంలో ట్రయల్‌లో ఉన్న కేసుల పురోగతితోపాటు కేసు ఏ దశలో ఉన్నదో కూడా తెలుసుకోవచ్చని వివరించారు. ఇది పోలీసు అధికారులకే కాకుండా ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్లకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఒకే ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ట్రయల్ కేసులను అటు పోలీసులు, ఇటు ప్రాసిక్యూటింగ్ అధికారులు పర్యవేక్షణ చేయడం సులభతరమవుతుందని వివరించారు.
ఈ యాప్‌ను పోలీసు కమిషనర్ దగ్గర నుంచి కోర్టు విధులు నిర్వహించే అధికారి వరకు ప్రతిరోజు కేసుల పురోగతిని పర్యవేక్షించేందుకు వీలుగా రూపొందించినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా కేసు పురోగతిని తెలుసుకుని దానికి అవసరమైన తదుపరి ప్రణాళికను రూపొందించుకోవచ్చని, అంతేకాకుండా కేసు విచారణ లేదా దర్యాప్తులో ఉన్న లోపాలను గుర్తించి, పకడ్బందీగా దర్యాప్తు జరిపి నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకునే వీలు ఉంటుందని తెలిపారు.
యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాశ్ మహంతి, రంగారెడ్డి జిల్లా ప్రాసిక్యూషన్స్ డిప్యూటీ డైరెక్టర్ జి.కస్తూరి బాయి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జిల్లా జాయింట్ డైరెక్టర్ సి.రాము, సంగారెడ్డి జిల్లా పీపీ జాయింట్ డైరెక్టర్ జె.శ్రీనివాస్‌రెడ్డి, ప్రాసిక్యూషన్ ఆఫీసర్, లీగల్ అడ్వైజర్ బాల బుచ్చయ్య, రేవరెడ్డితో పాటు డీసీపీలు, ఏసీపీలు, కోర్టు కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.