మేడ్చల్, జనవరి 5 : మేడ్చల్లో ఘోర రోడ్డు ప్రమా దం జరిగింది. స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుండగా మృత్యురూపంలో దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు, కూతురు మృతి చెందగా, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లాకు చెందిన సాగి బుల్లబ్బాయి(37), సాగి లావణ్య(32) దంపతులకు సాగి హర్షిత(8), సాగి సిద్ధేశ్వర్(6) సంతానం.
ఉపాధి నిమిత్తం ఈ దంపతులు హైదరాబాద్కు వచ్చి ఉప్పల్లో నివాసం ఉంటున్నారు. బుల్లబ్బాయి వాహనంపై ఇడ్లీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నా డు. కాగా.. మేడ్చల్ మండలం, ఎల్లంపేట గ్రామంలో నివాసం ఉంటున్న స్నేహితుడి భార్య చేయి విరగగా పరామర్శించేందుకు ఆదివారం తన టీవీఎస్ఎక్స్ఎల్పై భార్యా పిల్లలతో కలిసి బుల్లబ్బాయి బయల్దేరాడు. మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడ వద్దకు రాగానే.. వెనక నుంచి అతివేగంగా వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది.
ఈ ఘటనలో వారు కిందపడగా..పైనుంచి లారీ చక్రాలు వెళ్లాయి. దీంతో బుల్లబ్బాయి, లావణ్య, కూతురు హర్షిత అక్కడికక్కడే మృతి చెందారు. కొడుకు సిద్ధేశ్వర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సిద్ధేశ్వర్ను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.