సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఎన్నికల బరిలో ఎంఐఎం పార్టీ నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ, బీజేపీ నుంచి డాక్టర్ ఎన్ గౌతంరావు నిలవగా, బుధవారం పోలింగ్ ప్రక్రియ జరిగింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాల్లో మొత్తం ఓటర్లు 112 మందిలో 88 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
31 మంది ఎక్స్అఫీషియో మెంబర్లలో 22 మంది ఓటుహక్కును వినియోగించుకోగా.. 81 మంది కార్పొరేటర్లలో 65 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ఆనంతరం బ్యాలెట్ బాక్సులను స్టా్రంగ్ రూంలకు తరలించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు అభ్యర్థుల ఎజెంట్ల సమక్షంలో స్టా్రంగ్ రూమ్‌ను తెరిచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్‌హాల్‌లో కౌంటింగ్ మొదలు పెట్టనున్నారు.
కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో ఫలితం తేలనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా పోలైన ఓట్లలో సగానికి ఒక్క ఓటు ఎక్కువగా వస్తే ఆ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. అంటే 88లో 45 ఓట్లు వస్తే మెజారిటీ మార్క్ చేరుకోవచ్చు. అయితే ఎంఐఎం పార్టీకి సింగిల్‌గానే 50 మంది ఓటర్లున్నారు. కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది. ఈ లెక్కన చూస్తే ఎంఐఎం పార్టీ గెలుపు లాంఛనమే అన్నట్లు కనిపిస్తున్నది.
కౌంటింగ్ఏర్పాట్ల పరిశీలన..
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకులు సురేంద్ర మోహన్ గురువారం పరిశీలించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతితో కలిసి ఆయన సందర్శించారు. బ్యాలెట్ బాక్స్‌ల భద్రత, వీడియో రికార్డింగ్, సెక్యూరిటీ వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక కౌంటింగ్ టేబుల్స్, సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారులు వివరించారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆర్ఓ తెలిపారు. ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్ మంగతాయారు, అధికారులు పాల్గొన్నారు.