బడంగ్‌పేట, సెప్టెంబర్ 8: ‘ఉద్యోగులే కాంట్రాక్టర్లు’ శీర్షికతో ‘నమస్తే’లో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్ భాస్కర్ ముదిరాజ్, కంప్యూటర్ ఆపరేటర్ సుధాకర్‌పై వస్తున్న ఫిర్యాదులను పరిగణంలోకి తీసుకొని అధికార యంత్రాంగం కదిలింది.
మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఎంత అవినీతి దుర్వినియోగమైందన్న కోణంలో పై అధికారుల ఆదేశాల మేరకు కమిషనర్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. వర్క్ ఇన్స్పెక్టర్ భాస్కర్, కంప్యూటర్ ఆపరేటర్ సుధాకర్ ఎన్ని సంవత్సరాల నుంచి కార్పొరేషన్లో పనిచేస్తున్నారన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
గాయత్రీ ఎంటర్ ప్రైజెస్ బినామీ సంస్థ పేర్లతో ఎన్ని టెండర్లలో పాల్గొన్నారన్న అంశాలపై సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. గతంలో ఇద్దరిపై వచ్చిన ఫిర్యాదులపైనా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఇలాంటి పనులు ఎవరైనా చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి వేసిన అన్ని టెండర్ల జాబితాను అధికారులు పరిశీలిస్తున్నారు.