సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): జలమండలి జెట్టింగ్ యంత్రాల టెండర్ ప్రక్రియలో రోజుకో అవినీతి బాగోతం బయటపడుతున్నది. ఇటీవల 145 జెట్టింగ్ మిషన్ల టెండర్లో జరిగిన అవకతవకలు మరువక ముందే తాజాగా ఇంకో రూ. 40 లక్షల విలువైన ఇంకో యంత్రం కోసం ఆగమేఘాల మీద వేసిన టెండర్ వ్యవహారం బయటకు వచ్చింది. కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలో మురుగు శుభ్రం చేసేందుకు ఒక జెట్టింగ్ మిషన్ కోసం టెండర్ పిలిచారు.
ఆ టెండర్‌కు ఒక రోజు మాత్రమే గడువు ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్లు జలమండలి ఎండీకి ఫిర్యాదు చేయడంతో మళ్లీ టెండర్‌ను సవరిస్తూ మరో మూడు రోజులకు పొడిగించారు. ఇందులో ఓ డైరెక్టర్ హస్తం ఉన్నట్లు సమాచారం. టెండర్ గడువు ఒకేరోజు ఉండటం వల్ల ఎక్కువ మంది పాల్గొనకుండా చేసి.. ఆయనకు అనుకూలమైన కాంట్రాక్టర్‌కు దక్కేలా చేయాలని పావులు కదిపారు. అదికాస్తా ఎండీ దాకా వెళ్లడంతో నాలుక కరుచుకుని మరో మూడు రోజులు గడువు పెంచుతూ మళ్లీ రీటెండర్ వేశారు.
నచ్చినట్లు నిబంధనలు సడలిస్తూ…
కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలో మురుగు శుభ్రం చేసేందుకు రూ.40 లక్షలు విలువ చేసే జెట్టింగ్ యంత్రం సమకూర్చేందుకు ఏప్రిల్ 23న టెండర్ ప్రకటన చేసి, దానికి గడువు ఏప్రిల్ 24 వరకే ఉన్నట్లు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఒక టెండర్ గడువు కనీసం వారం రోజుల నుంచి పది రోజుల దాకా ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో మాత్రం ఒక రోజులో ముగిస్తారు. కానీ కుత్బుల్లాపూర్ పరిధిలో ఎలాంటి ఎమర్జెన్సీ లేదని తెలుస్తున్నది.
గతంలో ప్రకటించిన 80 యంత్రాల టెండర్లో పది రకాల నిబంధనలు ఉంచారు. కానీ ఈ టెండర్లో ఏకంగా 14 రకాల నిబంధనలు పెడుతూ ఇతరులెవరూ పాల్గొనకుండా చేశారు. చివరకు ఆ ఉన్నతాధికారి కోరిక ప్రకారం టెండర్ గడువు ముగిసేసరికి ఆయన అనుకూల కాంట్రాక్టర్‌తో పాటు మరో నలుగురు టెండర్లో పాల్గొన్నారు. అందులో ముగ్గురిని వివిధ కుంటిసాకులు చూపుతూ రిజెక్ట్ చేశారు. మిగిలిన ఇద్దరిలో కేవలం ఆయన అనుకూల వ్యక్తికే కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా టెండర్ పూర్తి చేసి, యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురాకుండా కాలయాపన చేస్తున్నారు. ఆయన అనుకూల వ్యక్తికే దక్కేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.