అనర్హులకు అందలం.. జలమండలి అవినీతిమయం
జలమండలి ఫైనాన్స్ విభాగం ఉన్నతాధికారులకు అక్షయ పాత్రగా మారింది. బడా కాంట్రాక్టర్లు, ప్రాజెక్టుల నుంచి కమీషన్లు దండుకునేందుకు ప్రధాన ఆదాయ వనరుగా వాడుకుంటున్నారు. అందులో భాగంగా వారికి అనూకూలంగా ఉన్నవారిని ఎలాంటి అర్హతలు, అనుభవంతో సంబంధం లేకుండా డైరెక్టర్ స్థానంలో కూర్చోబెడుతున్నారు. ఉన్నతాధికారులకు ఆదాయ వనరులు సమకూర్చేందుకు ఇతర ప్రభుత్వ శాఖల నుంచి తమకు అనుకూలమైన ఉద్యోగులను తీసుకొస్తున్నారు
- నిబంధనలు తుంగలో తొక్కుతూ డీజీఎం క్యాడర్ అధికారికి డైరెక్టర్ పోస్టు
- బడా కాంట్రాక్టర్లకులబ్ధి చేకూర్చేందుకు ఉన్నతాధికారుల వ్యూహమా?
- బిల్లుల మంజూరులో కమీషన్లు దండుకోవడమే లక్ష్యమా?
- ఇష్టం లేకున్నా.. ఒత్తిడి చేసి పోస్టింగ్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటి?
- ఉన్నతాధికారుల కమీషన్ల కోసమేనా?..వాటర్‌బోర్డులో చర్చ
జలమండలి ఫైనాన్స్ విభాగం ఉన్నతాధికారులకు అక్షయ పాత్రగా మారింది. బడా కాంట్రాక్టర్లు, ప్రాజెక్టుల నుంచి కమీషన్లు దండుకునేందుకు ప్రధాన ఆదాయ వనరుగా వాడుకుంటున్నారు. అందులో భాగంగా వారికి అనూకూలంగా ఉన్నవారిని ఎలాంటి అర్హతలు, అనుభవంతో సంబంధం లేకుండా డైరెక్టర్ స్థానంలో కూర్చోబెడుతున్నారు. ఉన్నతాధికారులకు ఆదాయ వనరులు సమకూర్చేందుకు ఇతర ప్రభుత్వ శాఖల నుంచి తమకు అనుకూలమైన ఉద్యోగులను తీసుకొస్తున్నారు. అర్హత లేని ఉద్యోగులను ఫైనాన్స్ విభాగం డైరెక్టర్లుగా నియమిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నట్లు బోర్డు కోడై కూస్తున్నది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ వ్యవహారం డైలీ సీరియల్లా సాగుతూనే ఉన్నది.
సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) జలమండలిలోని అన్ని విభాగాలకు డైరెక్టర్లుగా సంబంధిత సీజీఎంలకు పదోన్నతులు కల్పించి నియమిస్తారు. కానీ కేవలం ఒక ఫైనాన్స్ విభాగానికి మాత్రం బోర్డుకు సంబంధం లేని ఉద్యోగులను తీసుకొస్తున్నారు. ఆ విభాగానికి సంబంధించిన విధివిధానాలపై అవగాహన ఉందా? ఆ స్థానంలో విధులు నిర్వర్తించడానికి కావాల్సిన అర్హతలు ఉన్నాయా? ఫైనాన్స్ వ్యవహారాలను చూసుకునేంత అనుభవం ఉందా? అనే కీలక విషయాలను పట్టించుకోకుండా ఉన్నతాధికారులు చెప్పినట్లు వ్యవహరిస్తూ… వారి ఆదేశాలకు తలూపే ఉద్యోగులుంటే ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చని భావిస్తున్నారు. దీంతో కొద్ది సంవత్సరాలుగా అనర్హులను ఆ కుర్చీలో కూర్చోబెట్టి కీలుబొమ్మలను చేస్తున్నట్లు జలమండలిలో తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ప్రాజెక్టులు, ట్రాన్స్మిషన్, కాంట్రాక్టుల ద్వారా పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటూ జలమండలిని అవినీతి కూపంలోకి నెట్టేస్తున్నారని అటెండర్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల దాకా బహిర్గతంగానే చర్చించుకుంటున్నారు.
కమీషన్లే లక్ష్యంగా..
జలమండలి ఫైనాన్స్ విభాగంలో డైరెక్టర్, సీజీఎంగా విధులు నిర్వర్తించేవారు ఐఏఏఎస్ లేదా ఛార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) డిగ్రీ 50వ ర్యాంకులోపు పాసై ఉండాలి. అంతకంటే ఎక్కువ ర్యాంకు ఉంటే కనీసం రెండేండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. సీజీఎం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమిస్తారు. ఈ అర్హతలు కలిగిన సీజీఎంలకే డైరెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తారు. కానీ జలమండలిలోని అధికారులకు పదోన్నతులు కల్పిస్తే తమ చెప్పుచేతల్లో ఉండరని, వారి అక్రమ సంపాదనకు అడ్డుగా ఉంటారని కొన్నేండ్లుగా ఇతర శాఖల నుంచి అనర్హులను తీసుకొచ్చి ఫైనాన్స్ డైరెక్టర్ కుర్చీలో కూర్చోబెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. జలమండలి నుంచి కాకుండా ఇతర శాఖల నుంచి తీసుకోవాలనుకుంటే వారికి తప్పనిసరిగా సీఏ డిగ్రీతో పాటు 20 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
కానీ ప్రస్తుతం విధుల్లో ఉన్న ఫైనాన్స్ డైరెక్టర్‌కు ఆ అర్హతలేమీ లేకున్నా ఉన్నతాధికారుల ఒత్తిడి, ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదంతో ఆయనకు ఇష్టం లేకున్నా తీసుకొచ్చి కూర్చోబెట్టారని చర్చ జరుగుతున్నది. ఆయన 2007 గ్రూప్-2 ఉద్యోగి. స్టేట్ ఫైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ సెక్రెటరీగా విధుల్లో ఉండగా.. ఆగమేఘాల మీద జాయింట్ డైరెక్టర్‌గా తాత్కాలిక పదోన్నతి కల్పిస్తూ జలమండలికి డిప్యూటేషన్‌పై పంపించారు. ఆయనకు చార్టర్డ్ అకౌంటెంట్ డిగ్రీతో పాటు 20 ఏండ్ల పని అనుభవం లేదు. ఆయన క్యాడర్ జలమండలిలోని డీజీఎం-జీఎం స్థాయిలో ఉన్నది. డీజీఎం స్థాయి ఉద్యోగిని ఫైనాన్స్ డైరెక్టర్‌గా తీసుకురావడం వెనుక ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు జలమండలిలో జోరుగా చర్చ జరుగుతున్నది. బడా కాంట్రాక్టుల నుంచి దండిగా కమీషన్లు దండుకోవాలంటే బయటి నుంచి వచ్చి.. తాము చెప్పినట్లు వినేవాళ్లయితేనే బాగుంటుందని ప్లాన్ వేసినట్లు గుసగుసలాడుతున్నారు.
లోపించిన పారదర్శకత
జలమండలికి ఫైనాన్స్ విభాగం గుండెకాయ లాంటిది. బోర్డు పరిధిలో జరిగే అన్ని కార్యకలాపాలకు మెయిన్ పిల్లర్ లాంటిది. అటువంటి ఫైనాన్స్ విభాగం అస్తవ్యస్తంగా తయారైంది. పారదర్శకత లోపించడంతో ఫైనాన్స్ విభాగంపై తీవ్ర విమర్శలు వెల్లుత్తుతున్నాయి. కొద్దిరోజులుగా బిల్లుల మంజూరు, ఫైనాన్స్ విభాగం కార్యకలాపాలు పూర్తిగా గాడి తప్పాయి. ఉన్నతాధికారులకు అనుకూలమైన బడా కాంట్రాక్టర్లకు గడువు కంటే ముందుగానే బిల్లులు మంజూరవుతున్నాయి. ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువగానే బిల్లులు మంజూరు చేస్తూ.. కమీషన్లు దండుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ సీవరేజి పనులు చేసే చిన్నచిన్న కాంట్రాక్టర్లను మాత్రం రోజుల తరబడిగా తిప్పించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బిల్లుల మంజూరులో టోకెన్ వ్యవస్థ లేకుండా అధికారులకు నచ్చివాళ్లకు, కమీషన్లు ముట్టజెప్పిన వాళ్లకు తొందరగా మంజూరు అవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
ఈనేపథ్యంలో తాజాగా ఏకంగా ఫైనాన్స్ డైరెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడటం విమర్శలకు బలం చేకూరుస్తున్నది. డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి పదిరోజులు కూడా పూర్తికాకుండానే ఏసీబీ అధికారులకు చిక్కడంతో జలమండలిలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతున్నది. జలమండలి విధి విధానాలతో సంబంధం లేని అధికారి దాన్ని అవగతం చేసుకునేందుకు కనీసం రెండు మూడు నెలలైనా పడుతుంది. కానీ వారం దాటకముందే అవినీతికి పాల్పడటంపై.. ఉన్నతాధికారుల ప్రోత్సాహం లేకుండానే జరుగుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరి అండదండలతో అత్యంత తక్కువ సమయంలో వసూళ్లకు పాల్పడ్డారనే చర్చ జలమండలిలో మారుమోగుతున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

