విద్యుత్ కొత్త కనెక్షన్ల వెనక అవినీతి భాగోతం ఇలా ఉంటే… భారీ నిర్మాణాలకు సంబంధించి కనెక్షన్లకు పొందాల్సిన ఎన్వోసీ జారీ అనేది కనిపించని అవినీతికి కేంద్రంగా మారింది. సాధారణంగా 15, అంతకుమించి మీటర్ల ఎత్తు ఉన్న బహుళ అంతస్తుల నిర్మాణాలకుగానీ భారీ వ్యాపార సముదాయాలు, పరిశ్రమలకు కరెంటు కనెక్షన్ మంజూరైతే… విద్యుత్ ప్రధాన తనిఖీ అధికారి (సీఈఐజీ – చీఫ్ ఎలక్టిక్రల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్) విభాగం వారు పరిశీలించి అన్ని రకాలు మంచిగా ఉందంటూ ఎన్వోసీ జారీ చేయాల్సి ఉంటుంది.
పైగా ప్రతి సంవత్సరం ఈ ఎన్వోసీలను రెన్యువల్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇదే ఆ విభాగానికి కాసుల వర్షాన్ని కురిపిస్తుందనే ఆరోపణలున్నాయి. సదరు తనిఖీ అధికారులు కారు దిగకుండానే దళారుల ద్వారా లక్షల రూపాయలు పుచ్చుకొని తనిఖీలు లేకుండా ఎన్వోసీలు జారీ చేస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. గతంలోనూ ఈ విభాగంలో ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగళాలు కూడా ఉన్నాయి.
* సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని ఒక ప్రాంతంలో వివాదాస్పద భూమి (కోర్టులో కేసు పెండింగు)లో ప్లాట్లకు మీటర్లు ఇచ్చేందుకు భారీ మొత్తాన్ని పుచ్చుకున్నారు. దీనిపై ఫిర్యాదులు పోవడంతో ఉన్నతాధికారులు ఒక అధికారిని బదిలీ చేయడంతో పాటు పలువురు అధికారులపై బదిలీ వేటు వేశారు. కానీ రోజుల వ్యవధిలోనే సదరు అధికారి పైరవీ చేసి ప్రభుత్వ పెద్ద ఒకరి ఆశీర్వాదంతో బదిలీ ఉత్తర్వులను రద్దు చేయించుకున్నారు. తిరిగి అదే స్థానంలో దర్జాగా విధులు నిర్వహిస్తున్నారు.
* తాజాగా ఇదే సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలి ఏడీఈ కార్యాలయంలో రెండు అపార్టుమెంట్లకు కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం ఏడీఈ రూ. లక్ష లంచం డిమాండు చేశారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు నిబంధనల ప్రకారమే రూ.4-5 లక్షలు అవుతుంది. అదనంగా ఏడీఈకి అమ్యామ్యాలు. సదరు యజమాని ఇంతకుముందే రూ.25వేలు ఇచ్చారు. పాత బాకీ రూ.25, రెండో దానికి రూ. 50వేలు.. మొత్తం రూ.75వేలు ఇస్తేనే రెండో ట్రాన్స్ఫార్మర్ అమరుస్తామన్నారు.
కడుపు మండిన యజమాని ఏసీబీకి సమాచారం ఇచ్చారు. శుక్రవారం రూ.50వేలు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదీ… విద్యుత్ శాఖలో వైర్లూనుకుపోయిన అవినీతికి ఓ మోస్తరు ఉదాహరణలు. కానీ బయటికి రాకుండా ఏటా కోట్లాది రూపాయలు అక్రమంగా చేతులు మారుతున్నాయి. అందుకే సైబర్ సిటీతో పాటు దక్షిణ డిస్కం పరిధిలో మరో నాలుగు సర్కిళ్ల పరిధుల్లో పోస్టింగులు అంటేనే భారీ డిమాండు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే! మరోవైపు బహుళ అంతస్తులతో పాటు వ్యాపార, పారిశ్రామిక కనెక్షన్లకు సీఈజీఐ నుంచి ఇవ్వాల్సిన నిరభ్యంతర ధ్రువపత్రం కోసం ఒక్కో కేసులోనే లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి.
విద్యుత్ శాఖలో తరచూ అవినీతి నిరోధక శాఖ వలకు అవినీతి చేపలు పడుతూనే ఉన్నాయి. కానీ బయటికిరాని ఇలాంటి అవినీతి భాగోతాలు ఎన్నో.. ప్రాణాలు లెక్క చేయకుండా కిందిస్థాయి ఆర్టిజెన్స్ సేవలు అందిస్తుంటే ఎగువ స్థాయిలో మాత్రం కుర్చీ కదలకుండా జోరుగా కాసుల దందా కొనసాగుతున్నది. అందుకే దక్షిణ డిస్కం పరిధిలోని ప్రధానంగా ఐదు సర్కిళ్ల పరిధుల్లో పోస్టింగుల కోసం భారీ ఎత్తున డిమాండు ఉంది. సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, మేడ్చల్‌తో పాటు సంగారెడ్డి సర్కిళ్ల పరిధుల్లో పోస్టింగుల కోసం లక్షలాది రూపాయలు ఇచ్చి వచ్చామని పలువురు అధికారులు బహిరంగంగానే చెబుతారు.
ఈ ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు రావడంతో పాటు అపార్టుమెంట్లు, వ్యాపార, పారిశ్రామిక సముదాయాలు ఎక్కువగా వస్తాయి. దీంతో వీటికి కరెంటు కనెక్షన్లు ఇచ్చేందుకు పెద్ద ఎత్తునే చేతులు తడపాల్సి వస్తున్నది. అందుకే కేవలం గత ఆర్నెల్ల వ్యవధిలోనే నగరంలో వివిధ హోదాల్లోని ఏడుగురు విద్యుత్ శాఖ అధికారులు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు మరో తొమ్మిది మందికి షోకాజు నోటీసులు జారీ చేశారు. ఇక… పైరవీలు లేకపోతే ఆ అధికారులకు పాతబస్తీ, కార్యాలయ విధులే శరణ్యం అవుతాయనేది విద్యుత్ శాఖలో బహిరంగ రహస్యం. అందుకే ఈ రెండు ప్రాంతాల్లో విధులను నాన్ ఫోకల్ పోస్టులుగా అభివర్ణిస్తారు.