శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18: కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ సెంట్రల్ పార్క్ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్లోని కొండాపూర్ సెంట్రల్ పార్క్ కాలనీలో కాలనీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు విషయమై ఈ సందర్భంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులతో పాటు వివిద శాఖల అధికారులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
కాలనీల సమస్యలను పరిష్కరించుకుందాం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18: డివిజన్లోని కాలనీల్లో స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం గచ్చిబౌలి డివిజన్లో వివిధ కాలనీల సంక్షేమ సంఘాల నాయకులతో కాలనీ కాంటాక్ట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుల్మోహర్ పార్క్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, లక్ష్మీవిహార్ ఫేజ్-1, లక్ష్మీవిహార్ ఫేజ్2 కాలనీల్లో నెలకొన్న పలు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ రాజశేఖర్, జలమండలి మేనేజర్ నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఎస్ఆర్పీ భరత్‌తో పాటు పలువురు కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
హనీఫ్ కాలనీలో పర్యటించిన అధికారులు
కొండాపూర్, ఏప్రిల్ 18 : కాంటాక్ట్ కాలనీ కార్యక్రమంలో భాగంగా అధికారులు కాలనీల సమస్యలను ప్రజల్లోకి వెళ్లి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కార్యక్రమంలో భాగంగా పలు విభాగాల అధికారులు మంగళవారం శేరిలింగంపల్లి సర్కిల్ -20 పరిధిలోని కొండాపూర్ డివిజన్ హనీఫ్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎదుర్కుంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తాత్కాలిక పరిష్కారాలతో కాలం వెల్లదీయకుండా శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలియజేశారు. కాలనీలో పర్యటించిన వారిలో 15 విభాగాల అధికారులు ఉన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, వీధి దీపాలు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, తదితర సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు.