బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 13, 2020 , 07:45:36

‘కరోనా’ వీసా తప్పనిసరి

‘కరోనా’ వీసా తప్పనిసరి

హైదరాబాద్‌  : ఇటలీకి వెళ్లాలన్నా, అక్కడి నుంచి ఎక్కడికైనా పోవాలన్నా ‘కరోనా’ వీసా కావాలి. ఈనెల 10వ తేదీ నుంచి విమానమెక్కాలంటే ‘కరోనా’ లేదని సర్టిఫికెట్‌ కావాలన్న నిబంధన పెట్టింది అక్కడి ప్రభుత్వం. డాక్టర్‌ దగ్గర వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆయనిచ్చే రిపోర్టే ‘వీసా’. అది పొందాలంటే కరోనా అనుమాతులతో పాటే క్యూ కట్టాలి. దీంతో భయం.. భయంగా తెలుగు విద్యార్థులు గడుపుతున్నారు. సర్టిఫికెట్‌ పొందాలా? వద్దా? కరోనా వైరస్‌ సోకకపోయినా.. ఆ చాంతాడంత క్యూ లైన్లో నిలబడితే వైరస్‌ అటాక్‌ తప్పదన్న ఆందోళన. పైగా ఇటాలియన్‌ భాష వచ్చిన తెలుగు వారి సంఖ్య తక్కువే. దాంతో వాళ్లను మెప్పించలేక, ఒప్పించలేక.. డాక్టర్‌ నుంచి కరోనా వైరస్‌ సోకలేదన్న ధ్రువీకరణ పొందలేక సతమతమవుతున్నారు. మాతృదేశానికి వెళ్లలేక ..ఇటలీలో భయంతో గడుపుతున్నామని హైదరాబాద్‌కు చెందిన ఎం.శ్రీకాంత్‌ అనే విద్యార్థి ‘నమస్తే తెలంగాణ’కు వివరించాడు. ఈనెల 7వ తేదీలోపు ఎలాంటి నిబంధన లేకుండానే విమాన ప్రయాణాలకు అనుమతించారు. వైరస్‌ తీవ్రత పెరుగడంతో ఇటలీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. మార్చి 10వ తేదీ నుంచి విమాన ప్రయాణం చేయాలంటే కరోనా వైరస్‌ సోకలేదన్న ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అంటూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఐతే అంతకు ముందే టిక్కెట్లు బుక్‌ చేసుకున్న తెలుగు వారి కాళ్లకు బంధనాలు పడ్డాయి. దాంతో ఇక్కడికి వద్దామనుకున్న విద్యార్థులు, ఉద్యోగులు సతమతమవుతున్నారు. మిలాన్‌ విమానాశ్రయం నుంచి పలువురు విద్యార్థ్ధులు వారు ఎదుర్కొంటున్న సమస్యను, ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. దీంతో మంత్రి కేటీఆర్‌ కూడా స్పం దించి వాళ్లను వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించడం ద్వారా ఇటలీలో చిక్కుకుపోయిన విద్యార్థ్ధులకు న్యాయం లభిస్తుంది. ఇటలీలో ప్రధానంగా మిలాన్‌, రోమ్‌ నగరాలకు 100 కిలోమీటర్ల పరిధిలోనే అత్యధిక యూనివర్సిటీలు ఉన్నాయి. ఉపాధి అవకాశాలు కూడా ఆ ప్రాంతాల్లోనే ఎక్కువ. తెలుగు వారు సైతం ఆ రెండు నగరాల్లోనే అధికంగా ఉన్నారు. 


అన్నీ బంద్‌..

ఇటలీలో ఉద్యోగులందరికీ ‘వర్క్‌ ఫ్రంహోం’ అవకాశం ఇచ్చేశారు. దాంతో ఏ ఒక్కరూ వీధుల్లో కనిపించడం లేదు. నిత్యం కిటకిటలాడే వీధులన్నీ వెలవెలబోతున్నాయి. పార్కింగ్‌ చేసిన కార్లు దుమ్ము కొట్టుకుపోతున్నాయి. ఆఖరికి రెస్టారెంట్లు, సూపర్‌ మార్కెట్లు కూడా తెరువడం లేదు. ఎక్కడైనా తెరిచినా కొన్ని గంటలు మాత్రమే. ఐతే మార్కెట్‌/మాల్‌లోకి ఐదుగురు వెళ్లి, వారు షాపింగ్‌ చేసుకొని బయటికి వచ్చే వరకు ఇతరులను పంపడం లేదు. వారొచ్చిన తర్వాతే మరో ఐదుగురు లోనికి వెళ్లాల్సి వస్తోందని మిలాన్‌ నగరంలో ఉంటోన్న శ్రీకాంత్‌ వివరించాడు. అనవసరంగా రోడ్లపైకి వస్తే పోలీసులు జరిమానాలు కూడా విధిస్తున్నారు. పార్కులు, రెస్టారెంట్లు, బార్లు, షాపింగ్‌ మాల్స్‌, సూపర్‌ మార్కెట్లు.. అన్నీ మూతపడ్డాయి. ఎక్కడైనా తెరిచారని తెలిస్తే సరిపడా సామాగ్రిని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులకు భయపడిన వారే తక్షణం మాతృదేశాలకు వెళ్లాలని తొందర పడుతున్నారు. కొందరేమో ఎలాగూ వర్క్‌ ఫ్రం హోం కదా.. ఇబ్బందేమీ ఉండదన్న ధీమాతో ఉన్నారు. ప్రధానంగా విద్యార్థులే తిరిగి వెళ్లాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. 


వాట్సాప్‌ గ్రూపులతో క్షేమ సమాచారం

రోమ్‌, మిలాన్‌ నగరాల్లో ఉన్న తెలుగు, ఇతర భారతీ యుల్లో వాట్సాప్‌ గ్రూపులు ఉన్నాయి. వాటి ద్వారా ఒక్కొక్కరి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలు సుకుంటున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే నిమిషాల్లోనే అంబులెన్స్‌ వచ్చే సదుపాయం ఇటలీలోనూ ఉంది. ఐతే చైనా, టర్కీ, రష్యావాళ్లను మాత్రం ఇటలీ నుంచి త్వరగా పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. వారందరికీ ఎమెర్జెన్సీ పేరిట వైద్య పరీక్షలు చేసి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఆ తర్వాతే భారతీయులకు అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడున్న వారి తల్లిదండ్రులు, బంధు మిత్రులెవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని శ్రీకాంత్‌ అభిప్రాయపడ్డారు. logo