సిటీబ్యూరో: సిటీలో కాంట్రాక్ట్ పెండ్లీలు మళ్లీ మొదలవుతున్నాయి. ఫోన్ల ద్వారానే ఈ పెండ్లీలు జరుగుతున్నట్లు సమాచారం. విదేశాల్లో ఉండే బ్రోకర్లు, ఇక్కడుండే బ్రోకర్ల ద్వారా పేదరికంతో ఉన్న మహిళలు, యువతులను ఈ కాంట్రాక్ట్ పెండ్లీల ద్వారా ఆకర్షిస్తున్నారు. ఇదంతా అంతర్జాతీయ స్థాయిలో మానవ అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఓల్డ్‌సిటీకి చెందిన ఓ న్యాయవాది ఈ విషయంపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఏజెంట్లు ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కొందరు భయపడుతున్నట్లు సమాచారం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్‌ల వ్యవహారాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. దీంతో పదేండ్లు హైదరాబాద్ వైపు ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్‌ల బ్రోకర్లు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు మళ్లీ బ్రోకర్లు తమ కాంట్రాక్ట్ మ్యారేజ్‌ల వ్యవహారాన్ని తిరిగి ప్రారంభించారని చర్చ జరుగుతున్నది. గతంలో మొదట పోలీసులకు ఫిర్యాదులు రాకున్నా, ఈ కాంట్రాక్ట్ పెండ్లిండ్లకు సంబంధించిన వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపి బాధితులను గుర్తించి బ్రోకర్లు, పెండ్లి చేసుకున్న విదేశీయులను, కొందరు స్థానికంగా ఉండే ఖాజీలతో పాటు, ముంబైలోని ఖాజీలను సైతం అరెస్ట్ చేశారు. ఇలా కాంట్రాక్ట్ పెండ్లీలకు హైదరాబాద్‌లో తావు లేదని అప్పటి పోలీసు అధికారులు బ్రోకర్లకు గట్టి వార్నింగ్ ఇవ్వడంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా విదేశీయులతో కాంట్రాక్ట్ మ్యారేజెస్‌ను అణిచివేశారు. ఈ ఏడాది ప్రభుత్వం మారడంతో కాంట్రాక్ట్ పెండ్లీలకు సంబంధించిన నెట్ వర్క్ యాక్టివేట్ అయింది.
ఇప్పుడు బ్రోకర్ నెట్వర్క్ తిరిగి యాక్టివ్ అవుతున్నది. ఇందులో భాగంగా నేరుగా కాంట్రాక్ట్ పెండ్లి కోసం హైదరాబాద్‌కు షేక్స్ వస్తే ప్రమాదమని, పోలీసులకు దొరికితే అరెస్ట్ అవుతారని భావించారు. దీంతో అక్కడుండే బ్రోకర్లు గతంలో బ్రోకర్లుగా పనిచేసిన నెట్‌వర్క్‌లోని వారిని సంప్రదిస్తున్నారు. తలాబ్‌కట్ట, తీగల్కుంట, ఫలక్‌నుమా, షాహీన్‌నగర్, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లోని పాత గ్యాంగ్‌లను సంప్రదిస్తున్నారు.
అక్కడ కాంట్రాక్ట్ట్ పెండ్లి కావాల్సిన వారు సిద్ధంగా ఉండగానే, ఇక్కడ పేదరికంలో ఉండే యువతి, భర్త చనిపోయిన వారిని గుర్తించి వారికి కావాల్సిన ఆర్థిక సహాయానికి సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఆ తరువాత విదేశాల నుంచి వీడియో కాల్లో యువతి, మహిళలతో మాట్లాడిస్తూ, ఫోన్లోనే కాంట్రాక్ట్‌లు రాసుకుంటున్నారు. ఆ తరువాత విజిటింగ్ వీసా ఇప్పించి ఆయా దేశాలకు బాధితులను రప్పించుకుంటున్నట్లు సమాచారం.
కాగా తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదంటూ పోలీసులు ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుంది.. గతంలో అరెస్టయిన బ్రోకర్లు, గల్ఫ్‌దేశాలకు వెళ్లే వారిలో అనుమానాస్పదంగా కన్పిస్తే అలాంటి వారిని ప్రశ్నిస్తే ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్‌లకు సంబంధించిన గుట్టు బయటకు వచ్చే అవకాశాలున్నాయి.. దీనిపై పోలీసులు ఫోకస్ పెట్టాల్సిన అవసరముందని ప్రజలు సూచిస్తున్నారు. ఈ విధానంతో మహిళలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాలు రంగంలోకి దిగాయని, దీనిపై సీబీఐ ద్వారా విచారణ జరిపితే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ వ్యవహారం వెలుగులోకి వస్తుందంటూ ఓల్డ్‌సిటీకి చెందిన న్యాయవాది డిమాండ్ చేశారు.
బార్కాస్‌లో ఉన్న చాలా మంది ఒమన్ దేశం నుంచి వచ్చిన వారున్నారు. ఈ క్రమంలో 1970-80 దశకంలో ఒమన్ దేశస్తులు, హైదరాబాద్‌లోని బార్కాస్ ఇతర ప్రాంతాల్లో ఉండే వారి బంధువులను ఆరా తీసి పెండ్లిండ్లు చేసుకునేవారు. ఆ తరువాత తెలిసిన వారి ద్వారా గల్ఫ్ దేశాల్లో ఉండే వారు వివాహాలు చేసుకుంటూ ఆ నెట్‌వర్క్‌తో హైదరాబాద్‌లో ఉండే వారిని గల్ఫ్ దేశాలకు రప్పించుకునేవారు. ఈ క్రమంలోనే ఒమన్, ఖతర్, యూఏఈ తదితర దేశాల్లో డబ్బుండి, వయస్సు ఎక్కువగా ఉండే వారికి కాంట్రాక్ట్ పద్ధతిలో వివాహాలు చేసేందుకు బ్రోకర్ల వ్యవస్థ ప్రారంభమైంది.
విదేశాల్లో ఉండే డబ్బున్న వారికి, హైదరాబాద్ పరిసరాల్లో పేదరికంలో ఉండే మహిళలు, యువతులు, బాలికల కుటుంబాలకు డబ్బు ఎర చూపుతూ కాంట్రాక్ట్ వివాహాలు ఈ బ్రోకర్ వ్యవస్థ చేస్తూ వచ్చింది. విదేశాల్లో ఉండే ఏజెంట్లు, హైదరాబాద్‌లో ఉండే వారి నెట్‌వర్క్‌లోని ఏజెంట్లకు ఫలాన షేక్‌కు కాంట్రాక్ట్ పెండ్లి కావాలి..తగినంత డబ్బిస్తాడంటూ ఆఫర్ ఇవ్వడంతో అమ్మాయిలను, వితంతువులను ఇక్కడుండే వారు చూసి పెట్టేవారు. ఆయా దేశాల నుంచి ఇక్కడికి వచ్చి గుట్టుచప్పుడు కాకుండా కాంట్రాక్ట్ వివాహాలు చేసుకొని విదేశాలకు వెళ్లేవారు. విదేశాలకు వెళ్లిన తరువాత కొన్నాళ్లు బాధితురాలితో బాగుండి, ఆమెను వదులుకునేందు చాలా మంది చిత్రహింసలకు గురిచేసేవారు. మరికొందరు అక్కడకు తీసికెళ్లి వ్యభిచార గృహాలకు అమ్మేయడం వంటి ఘటనలు జరిగేవి.