సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రూ.18 లక్షలు వైద్య ఖర్చులతోపాటు 6 శాతం వడ్డీని చెల్లించాలని ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్‌కి వినియోగదారుల కమిషన్-1 ఆదేశించింది. వైద్య ఖర్చులు చెల్లించడంలో నిర్లక్ష్యం వహించినందుకు నష్టపరిహారం చెల్లించాలని, కోర్టు ఖర్చుల కింద రూ.25వేలు అందజేయాలని సూచించింది. నగరంలోని మోహన్‌నగర్ పరిధిలోని శృంగేరికాలనీకి చెందిన నరేశ్.. బేగంపేటలోని ఇండస్ ఇండ్ బ్యాంకు నుంచి సెక్యూర్డ్ లోన్ పొందారు. అయితే రుణం తీసుకున్న సమయంలో గ్రూప్ ఇన్సూరెన్స్ రూ. 59 లక్షల విలువైన పాలసీని రెండేండ్ల కాలపరిమితికి ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ నుంచి తీసుకున్నారు.
నామినీగా తన భార్య అరుణ రేఖను నమోదు చేశారు. అయితే పాలసీదారుడు 2020లో న్యూమెనియాతో బాధపడుతూ నగరంలోని మెడిసిస్ దవాఖానలో చేరి చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. అనంతరం 20 రోజులకే శ్వాస పీల్చుకోవడంలో సమస్య వల్ల తిరిగి అపోలో హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ పాలసీదారుడు మృతిచెందారు. మృతుడి భార్య ఇన్సూరెన్స్ బాండ్‌ను అందజేయాల్సిందిగా బ్యాంకు అధికారులను కోరగా, అందజేశారు. వైద్యఖర్చులతోపాటు బీమా డబ్బులను చెల్లించాల్సిందిగా అన్నీ పత్రాలతో ఇన్సూరెన్స్ కంపెనీకి బాధితురాలు విజ్ఞప్తి చేశారు. అయితే అంతకుముందు నుంచే ఉన్న వ్యాధులతో బాధపడుతూ మృతిచెందారని ఇన్సూరెన్స్ చెల్లింపును నిరాకరించింది. దీంతో నామినీ హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1ను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు.
కమిషన్ అధ్యక్షురాలు బి. ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీపసన్న, ఆర్.నారాయణరెడ్డిలతో కూడిన బెంచ్ కేసును విచారించింది. నిబంధనల ప్రకారం పాలసీదారుడు మృతి చెందితే బీమా చెల్లించాల్సిందేనని, వైద్యఖర్చులు సైతం అందజేయాలని బెంచ్ పేర్కొన్నది. ఇందులో వ్యతిరేక పక్షాలు వాదించేందుకు ఎలాంటి ఆధారం లేదని వివరించింది. ఇన్సూరెన్స్ సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిష్పక్షపాత సేవలను అందజేయాలని సూచించింది. ఈ సందర్భంగా పైవిధంగా ఆదేశాలను వెలువరించింది.