మలక్‌పేట, జనవరి 1: మద్యానికి బానిసైన ఓ కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆస్మాన్‌ఘడ్ ఎస్టీ బస్తీలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. 2014 బ్యాచ్‌కు చెందిన జాతావత్ కిరణ్(36) ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఆస్మాన్‌ఘడ్ ఎస్టీ బస్తీలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు (6, 9 ఏళ్ల వయస్సు) ఉన్నారు. పై పోర్షన్లో అతడి సోదరుడు నివాసముంటుండగా, కింది పోర్షన్లో కిరణ్ కుటుంబ సభ్యులు నివాసముంటున్నారు. కొంత కాలంగా మద్యానికి బానిసైన కిరణ్, భార్య పిల్లలను వేధిస్తుండేవాడు.
భార్య పిల్లలను గదిలో ఇంట్లో నుంబయటికి పంపించి తలుపులు వేసుకొని తాగుతుండేవాడు. అయితే నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నాలుగురోజుల ముందుగానే లీవ్ పెట్టి ఇంటి వద్దనే ఉంటున్న కిరణ్ నిత్యం తాగి భార్య పిల్లలతో గొడవ పడుతున్నాడు. బుధవారం ఉదయం తాగివచ్చి భార్య పిల్లలతో గొడవపడి వారిని బయటికి పంపించి తలుపులు వేసుకున్నాడు. దాంతో వారు ఇరుగు, పొరుగు ఇండ్లల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండి భోజనం చేసేందుకని ఇంటికి వచ్చారు. తలుపులను బాధినప్పటికీ లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కిటికిలో నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దాంతో బోరుమన్న అతడి భార్య, సోదరుడికి ఫోన్‌చేసి వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.